కలం, ఖమ్మం బ్యూరో: శబ్ద కాలుష్యంతో నివాస ప్రాంతాలు, రహదారులపై ప్రజల చెవుల్లో సీసాలు పోస్తున్న సైలెన్సర్ భేతాళులకు ఖమ్మం (Khammam) ట్రాఫిక్ పోలీసులు రోడ్డు రోలర్‌తో మంగళవారం గట్టి షాక్ ఇచ్చారు. గతంలో 1,654 బుల్లెట్ సైలెన్సర్లను తొక్కించి ధ్వంసం చేసిన పోలీసులు, తాజాగా మరో 400 మోడిఫైడ్ సైలెన్సర్లను రోడ్డు రోలర్ కింద నలిపేసి కఠిన సంకేతాలు పంపారు.
ఈ సందర్భంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దం వచ్చేలా అమర్చుకునే మోడిఫైడ్ సైలెన్సర్లపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. వాహనదారులు కంపెనీ నిర్దేశించిన ఒరిజినల్ సైలెన్సర్లను మాత్రమే వినియోగించాలని, ప్రజల ప్రశాంతతకు, ఆరోగ్యానికి విఘాతం కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శబ్ద కాలుష్య నియంత్రణకు పోలీసుల తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, ఏఆర్ ఏసీపీ సుశీల్ సింగ్, ఇన్స్పెక్టర్లు సత్యనారాయణ, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

