కలం, ఖమ్మం బ్యూరో : అర్హత కలిగిన ప్రతి పౌరుడి ఓటు హక్కుకు పూర్తి భద్రత కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని, రాజ్యాంగ పరిరక్షణే ప్రతి అధికారికి అత్యున్నత ప్రాధాన్యత అని జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ దేవసేన (Devsena) స్పష్టం చేశారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు.
అర్హత లేని ఓట్లను తొలగించడంతో పాటు, అర్హులైన అందరికీ ఓటు హక్కు లభించేలా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్‌ఐఆర్ నోటీసులు అందుకున్న ప్రతీ ఓటరు విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని, వివాహిత మహిళల పేర్లలో మార్పులు, అక్షర దోషాల వంటి చిన్నపాటి క్లరికల్ పొరపాట్లను స్వీయ ప్రకటన ద్వారా సరిచేసుకునే వెసులుబాటు ఉందని వివరించారు.
జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాలోని 12,43,781 మంది ఓటర్లలో ఇప్పటివరకు 1,36,787 మందికి నోటీసులు జారీ చేసి, 17,555 విచారణలు పూర్తి చేసినట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఓటర్లకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తున్నామని, ప్రక్రియలో ఎక్కడైనా ఉద్దేశపూర్వక అవకతవకలకు పాల్పడితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై రాజకీయ పార్టీ ప్రతినిధులకు మరోసారి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

