కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకే కాకుండా, కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలకు వేదికగానూ నిలిచింది. ఈ సభ ద్వారా కోమటిరెడ్డి బ్రదర్స్ (Komatireddy Brothers) వైఖరి ఏంటో అంతు చిక్కనిదిగా మారింది. సీఎంతో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహరించిన తీరు, మరోవైపు మంత్రి వెంకట్ రెడ్డి సభకు దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని, చర్చను రేకెత్తిచింది.
సీఎం రేవంత్ రెడ్డి నకిరేకల్ కు చేరుకున్నప్పటికీ, మంత్రి వెంకట్ రెడ్డి సభా వేదికపైకి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ‘అత్యంత ముఖ్యమైన పని ఉందంటూ’ ఆయన వేదికపైకి రాకుండానే హెలికాప్టర్లో వెళ్లిపోయారు. సభ ముగిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు బయలుదేరారు. సొంత జిల్లాలోనే సీఎం హాజరైన కీలక సభకు మంత్రి వెంకట్ రెడ్డి డుమ్మా కొట్టడం వెనుక అసలు కారణమేంటనే దానిపై పార్టీ వర్గాల్లో పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎలాంటి విభేదాల్లేవంటూ..
మరోవైపు, గతంలో సీఎం రేవంత్ రెడ్డిపై, పార్టీ విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సభలో పాల్గొని ఒక్కసారిగా ‘ప్లేట్ ఫిరాయించడం’ అందరినీ ఆశ్చర్యపరిచింది. సభా వేదికపై సీఎంని ఆయన శాలువాతో ఘనంగా సన్మానించారు.
వేదికపైనే వీరిద్దరూ ‘ప్రాణ మిత్రులవలె’ పక్కపక్కనే కూర్చుని ఆసక్తికరంగా ముచ్చటించుకోవడం సభలో హైలైట్‌గా నిలిచింది. గతంలో రేవంత్‌పై చేసిన తీవ్ర వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి వివరణ ఇస్తూ.. “నేను రేవంత్ రెడ్డిని ఎప్పుడూ దూషించలేదు, ఒకటి రెండు విధానపరమైన అంశాల్లో మాత్రమే విభేదించాను. సీఎంతో నాకు ఎలాంటి విభేదాలు లేవు” అని తేల్చిచెప్పారు.
తన నియోజకవర్గానికి సీఎం రూ. 2,000 కోట్ల నిధులు మంజూరు చేశారని, అందుకే వేలాది మంది కార్యకర్తలతో కలిసి సభకు హాజరయ్యానని పేర్కొన్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణపై అధిష్టానానిదే తుది నిర్ణయమని రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంత్రి పదవి కోసమే యూటర్న్?
త్వరలోనే రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఉండనుందనే వార్తల నేపథ్యంలో, మంత్రి పదవి దక్కించుకునే వ్యూహంతోనే సీఎం రేవంత్ రెడ్డితో రాజగోపాల్ రెడ్డి సఖ్యత ప్రదర్శిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిన్నటిదాకా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించి, ఆయన ఇప్పుడు ఒక్కసారిగా సీఎంకు జై కొట్టడం వెనుక రాజకీయ ప్రయోజనాలే కారణమన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా నల్లగొండ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో సీఎం, ఎమ్మెల్యే వ్యవహార శైలి హాట్ టాపిక్‌గా మారింది.

