కన్నీళ్ల నుంచి రికార్డుల దాకా.. స్మృతి మంధాన స్ఫూర్తి గాథ!

కలం, స్పోర్ట్స్ బ్యూరో: ఒకవైపు వ్యక్తిగత జీవితంలో అనుకోని మలుపు.. మరోవైపు కోట్లాది అభిమానుల అంచనాలు..! కళ్లలో కన్నీళ్లు దాచుకుని.. మనసులోని బాధను దిగమింగి.. మళ్లీ బ్యాట్‌ పట్టింది టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (Smriti Mandhana). ఇంట్లోనే కూర్చొని కుమిలిపోకుండా.. బయట ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా.. ఆటపైనే ఫోకస్‌ పెట్టింది. జీవితం వేసిన బౌన్సర్‌ను బ్యాట్‌తోనే ఎదుర్కొని.. బౌండరీ కొట్టింది. ఫలితం.. పరుగులు, శతకాలు, ప్రపంచ రికార్డులు..!

వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదురైతే.. ఎవరికైనా కోలుకోవడానికి సమయం పడుతుంది. కానీ, స్మృతి సాధారణ అమ్మాయి కాదు.. భారత్‌ గర్వించే ‘రన్‌ మెషిన్‌’. అనుకోని కారణాలతో గతేడాది నవంబర్‌ 23న జరగాల్సిన ఆమె పెళ్లి రద్దు కాగా.. ఈ విషయాన్ని డిసెంబర్‌ 7న స్వయంగా బయటకొచ్చి ప్రకటించింది. ఆ మరుసటి రోజే నెట్స్లోకి వెళ్లి బ్యాట్‌ పట్టింది. కన్నీళ్లను పరుగుల ప్రవాహంగా మార్చి, రికార్డుల వేట సాగిస్తున్నది. ఫలితంగా నేటి తరం అమ్మాయిలకే కాదు.. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ రియల్‌ రోల్‌ మోడల్‌గా నిలుస్తున్నది.

ఆట మారింది..

మంధానకు క్రికెట్‌ కొత్త కాదు.. కానీ, ఈసారి క్రీజులోకి వచ్చింది కొత్త మంధాన..! నిజానికి వ్యక్తిగత జీవితంలో కుదుపు ఎదురయ్యే సమయానికే భీకర ఫామ్‌లో ఉంది. 2025లో వన్డేల్లో ఏకంగా 1,362 పరుగులు చేసి, 61.90 సగటుతో ఐదు సెంచరీలు చేసింది. అంతటి ఫామ్‌లో ఉన్న మంధాన.. ఆ బాధ తర్వాత మైదానంలోకి తిరిగొస్తే ఎలా ఆడుతుందోనని అందరూ అనుకున్నారు. కానీ, ఆ ప్రభావాన్ని ఆటపై పడనివ్వలేదు. ఒకప్పుడు తన క్లాసిక్ కవర్‌ డ్రైవ్లు, అద్భుతమైన టైమింగ్‌తో ఆకట్టుకున్న మంధాన.. ఇప్పుడు అదే క్లాస్‌కు పవర్‌ హిట్టింగ్‌, అటాకింగ్‌ను జోడించింది. బంతిని గ్యాప్‌లోకి పంపడమే కాదు.. బౌలర్‌పై ఒత్తిడి పెంచి స్టాండ్స్‌లోకి తరిమే స్థాయికి తన ఆటను మార్చుకున్నది. క్రీజులో కుదురుకున్నాక గేర్‌ మార్చడం.. బౌలర్లపై ఒత్తిడి పెంచడం.. అవకాశం దొరికిన ప్రతిసారీ బౌండరీతో విరుచుకుపడటం.. ఆమె బ్యాటింగ్‌లో మరింత స్పష్టంగా కనిపిస్తున్నది.

ఫార్మెట్ ఏదైనా తగ్గేదేలే..

2026 టీ20 ప్రపంచకప్‌లో మంధాన దూకుడు కొనసాగింది. పాకిస్థాన్‌పై 44 బంతుల్లో 68 పరుగులు.. నెదర్లాండ్స్‌పై 47 బంతుల్లో 74 పరుగులతో జట్టుకు బలమైన ఆరంభాలు ఇచ్చింది. ఈ టోర్నీలో మొత్తంగా 41 సగటు, 140.41 స్ట్రైక్ రేట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. 2026 డబ్ల్యూపీఎల్లోనూ 377 పరుగులతో టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకుంది. ఫైనల్లో 41 బంతుల్లో 87 పరుగులతో చెలరేగి ఆర్సీబీకి రెండో టైటిల్‌ అందించింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో లార్ట్స్‌లో జరిగిన తొలి మహిళా టెస్ట్‌లోనూ తన క్లాస్‌ను చూపించింది. తొలి ఇన్నింగ్స్‌లో 83, రెండో ఇన్నింగ్స్‌లో 70 పరుగులు చేసి టీమిండియాకు చారిత్రక విజయంలో కీలక భాగమైంది. అంటే.. ఫార్మాట్‌ మారినా, పరిస్థితులు మారినా.. మంధాన బ్యాట్‌ మాత్రం పరుగుల బాటనే ఎంచుకున్నది.

ఒక్క ఇన్నింగ్స్.. రికార్డులన్నీ బ్రేక్

హాంకాంగ్‌తో గురువారం జరిగిన ఆసియా కప్‌ మ్యాచ్‌లో మంధాన బ్యాట్‌ విధ్వంసం సృష్టించింది. 64 బంతుల్లో 124 పరుగులు.. 14 ఫోర్లు.. 7 సిక్సర్లు.. 193.75 స్ట్రైక్ రేట్‌! ఇది ఆమె టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో రెండో సెంచరీ. మహిళల టీ20 ఆసియా కప్‌ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఈ ఇన్నింగ్స్‌తో మంధాన పరుగుల సంఖ్య 10,880కి చేరింది. దీంతో టీమిండియా దిగ్గజం మిథాలీ రాజ్‌ (Mithali Raj) పేరిట ఉన్న రికార్డు (10,868)ను అధిగమించి.. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచింది. అదే సమయంలో 18వ సెంచరీ పూర్తి చేసి.. మెగ్‌ లానింగ్‌, లారా వోల్వార్డ్ట్‌ (17)ను దాటి అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గానూ రికార్డు సృష్టించింది.

మంధాన స్పెషాలిటీ ఇదే..

2013లో బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన 16 ఏళ్ల మంధాన.. ఇప్పుడు 30 ఏళ్ల వయసులో మహిళల క్రికెట్‌లో ఓ బెంచ్మార్క్ గా నిలిచింది. ఒకప్పుడు మిథాలీ రాజ్‌ బ్యాటింగ్‌ను చూస్తూ స్ఫూర్తి పొందిన అమ్మాయి.. ఇప్పుడు అదే దిగ్గజం నెలకొల్పిన రికార్డును అధిగమించింది. అయితే, మంధానను ప్రత్యేకంగా నిలబెట్టేది ఈ రికార్డులు మాత్రమే కాదు. కన్నీళ్లను దిగమింగి.. బ్యాట్‌ను ఆయుధంగా మార్చుకొని.. తన పేరుతో కొత్త చరిత్ర రాస్తున్న తీరు. అందుకే మంధాన కథ కేవలం ఓ క్రికెటర్‌ రికార్డుల కథ కాదు. పడిపోవడం తప్పు కాదు.. అక్కడే ఆగిపోవడమే ఓటమి అని చెప్పే స్ఫూర్తి గాథ.

‘‘క్రీజులో ఉన్నంతసేపూ ఎన్ని పరుగులు చేశాననే లెక్కలు నా మైండ్లో ఉండవు. ఏ రికార్డు బ్రేక్ అయ్యిందో తెలియదు. మిథాలీ గొప్ప లెజెండ్‌, రోల్‌ మోడల్‌. దీదీ బ్యాటింగ్‌ చూస్తూనే మేమంతా పెరిగాం. అలాంటిది ఆమె రికార్డును నేను అధిగమిస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ప్రపంచంలోనే అత్యధిక పరుగులు చేసిన తొలి రెండు స్థానాల్లో మేమే ఉండటం హ్యాపీగా ఉంది. నా జెర్సీ నంబర్‌ కూడా 18. అందుకే 18వ సెంచరీ ప్రత్యేకం. రికార్డులు, నంబర్లతో నా కెరీర్ను కొలవను. నా ఆటను చూసి కనీసం పది శాతం మంది అమ్మాయిలైనా బ్యాట్‌, బాల్‌ పట్టుకుని క్రికెట్‌ ఆడాలని వస్తే.. అంతకంటే గర్వకారణం మరొకటి ఉండదు’’ – స్మృతి మంధాన

ఈ రికార్డుకు స్మృతి పూర్తిగా అర్హురాలు. సాధారణ ప్లేయర్ నుంచి దేశం గర్వించదగ్గ అత్యుత్తమ బ్యాటర్గా స్మృతి ఎదిగిన ప్రయాణాన్ని దగ్గరుండి చూశాను. నా రికార్డును అధిగమించి.. అంతర్జాతీయ క్రికెట్లో మంధాన అగ్రస్థానానికి చేరుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఇలాగే మరెన్నో పరుగులు సాధిస్తూ.. మరెన్నో మైలురాళ్లు చేరాలి. కీప్ గోయింగ్, స్మృతి – మిథాలీ రాజ్, టీమిండియా మాజీ కెప్టెన్

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>