కన్న పేగు వదిలేస్తే.. అమ్మలా ఆదరించింది!

కలం, దమ్మ పేట: ​నవ మాసాలు మోసి, కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లి పేగు తెంచుకుని పుట్టిన పసికందును అర్థరాత్రి వేళ రోడ్డుపై వదిలేసింది. పసిగుడ్డు ఏడుపు విన్న మరో తల్లి ఏ రక్తం పంచుకుని పుట్టకపోయినా, అక్కున చేర్చుకుని అమ్మలా జోలపాడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పట్వారిగూడెం (Patwarigudem)లో చోటు చేసుకున్న ఈ ఘటన కన్నపేగు కర్కశత్వాన్ని, ఆదరించిన తల్లి మనసు అమృతత్వాన్ని ఏకకాలంలో ఆవిష్కరించింది.

చీకట్లో వదిలేసిన కన్న ప్రేమ..

పట్వారిగూడెం(Patwarigudem)లోని ఓ ఇంటి ముందు బుధవారం రాత్రి గుర్తు తెలియని మహిళ ఒక మగ శిశువును వదిలి వెళ్లిపోయింది. ఆర్థిక ఇబ్బందులో.. మానసిక నైరాశ్యమో తెలియదు కానీ, ఊహ తెలియని ఆ పసికందును విధికి వదిలేసి వెళ్లింది. తన బిడ్డ వద్దనుకుంటే ప్రభుత్వ సంరక్షణ కేంద్రాలకు (ఉయల పథకం ద్వారా) అప్పగించే వెసులుబాటు ఉన్నా, ఇలా నడిరోడ్డున వదిలేయడం ఆమె అవగాహన రాహిత్యాన్ని చాటుతోంది.

అక్కున చేర్చుకున్న అనురాగం..

చీకట్లో ఆకలితో ఏడుస్తున్న పసికందు కేకలు విన్న కనకం కుమారి హృదయం ద్రవించిపోయింది. ఒక్క క్షణం ఆలోచించకుండా ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుంది. రెండు రోజుల పాటు తన సొంత బిడ్డలా ఆలనాపాలనా చూసుకుంది. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో ఇంటిగ్రేటెడ్ ఛైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్, ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు శుక్రవారం గ్రామానికి చేరుకున్నారు. శిశువును తమకు అప్పగించాలని కోరడంతో.. రెండు రోజులు అపురూపంగా చూసుకున్న ఆ పసికందును వదులుకోవాల్సి వస్తుందన్న ఆవేదనతో కనకం కుమారి కన్నీటి పర్యంతమైంది. “ఈ బిడ్డను నాకే ఇచ్చేయండి, ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకుంటా” అని అధికారులను వేడుకున్న దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది.

పోలీసులకు ఫిర్యాదు..

అధికారులు మాత్రం చట్ట ప్రకారం శిశువును స్వాధీనం చేసుకుని, మెరుగైన సంరక్షణ కోసం శిశు సంక్షేమ గృహానికి తరలించారు. అనంతరం దమ్మపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు కాగా.. పసికందును వదిలి వెళ్లిన మహిళ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. చట్టపరంగా అధికారుల చర్య సరైనదే అయినా.. కనకం కుమారి వంటి స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవారికి దత్తత నిబంధనలు సులభతరం చేసి, ఆ బిడ్డకు సురక్షితమైన నీడ దక్కేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

Also Read : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>