సీఎంఆర్‌పై స్పష్టత ఇవ్వాలి.. మిల్లర్ల డిమాండ్‌

కలం, నల్లగొండ బ్యూరో: “రాష్ట్ర ప్రగతికి రైతు ఒక కన్ను అయితే.. రైస్‌ మిల్లర్‌ మరో కన్ను. ఈ రెండూ కలిసి సాగితేనే వ్యవసాయ రంగంతో పాటు దేశం సుభిక్షంగా ఉంటుంది” అని నల్లగొండ (Nalgonda) జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ (Rice Millers Association) పేర్కొంది. మిల్లర్లు ఎదుర్కొంటున్న తీవ్ర నష్టాలు, పరిపాలనాపరమైన ఇబ్బందులను పరిష్కరించాలని మాత్రమే ప్రభుత్వాన్ని కోరుతున్నామని, తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని అసోసియేషన్‌ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఐదు రోజులుగా మిల్లులు బంద్‌ ఉన్నాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే పరిశ్రమలు కోలుకోలేని స్థాయిలో నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి బకాయిలు ఉన్న డిఫాల్టర్‌ మిల్లులను తనిఖీ చేసి, వారి నుంచి బకాయిలు వసూలు చేయడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ విషయంలో అధికారులకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. అయితే బకాయిలు లేని సక్రమంగా నడుస్తున్న మిల్లులను ఇన్‌స్పెక్షన్ల పేరుతో ఇబ్బంది పెట్టడం సరికాదని పేర్కొన్నారు. పరిశ్రమలోని 90 శాతం మంది మిల్లర్లను దొంగలు, దోపిడీదారులుగా ముద్ర వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆగస్టు 28 నుంచి బాయిల్డ్‌ రైస్‌ తీసుకోకుండా సీఎంఆర్‌ సేకరణను ప్రభుత్వం అకస్మాత్తుగా నిలిపివేసిందని తెలిపారు. కనీసం వారం రోజుల ముందైనా సమాచారం ఇవ్వకపోవడంతో మిల్లర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

7 లక్షల టన్నుల ధాన్యంతో నిండిన మిల్లులు

రబీ సీజన్‌లో కేటాయించిన సుమారు 7 లక్షల టన్నుల ధాన్యంతో మిల్లులు నిండిపోయాయని మిల్లర్లు తెలిపారు. బాయిల్డ్‌ రైస్‌ నిల్వలు పాడయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. మరోవైపు సీఎంఆర్‌ ఆలస్యమైతే 25 శాతం పెనాల్టీతో పాటు 12 శాతం వడ్డీ విధించడం తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రా రైస్‌ ఇవ్వడం సాధ్యం కాదని, ధాన్యాన్ని ప్రభుత్వమే తిరిగి తీసుకుని తమ ఖాతాల్లో జమ చేసుకోవాలని కలెక్టర్‌కు లేఖ రాసినట్లు తెలిపారు.

స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి

2026-27 వానాకాలం ధాన్యాన్ని ప్రభుత్వ గిడ్డంగుల్లోనే భద్రపరచాలని, సైంటిఫిక్‌ ‘టెస్ట్‌ మిల్లింగ్‌’ నిర్వహించిన తర్వాతే మిల్లులకు ధాన్యాన్ని కేటాయించాలని మిల్లర్లు కోరారు. రెండు లారీల ధాన్యానికి 67 శాతం రా రైస్‌, మరో రెండు లారీల ధాన్యానికి 68 శాతం బాయిల్డ్‌ రైస్‌ ఇచ్చేలా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. గత 40 ఏళ్లుగా రూ.10, రూ.20గా ఉన్న వర్కింగ్‌ ఛార్జీలు ఇప్పటికీ మారకపోవడం శోచనీయమన్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధంగానే మిల్లింగ్‌ ఛార్జీలను పెంచాలని కోరారు. ఛార్జీలు పెంచకపోతే పరిశ్రమలు మరింత తీవ్ర నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

పెండింగ్‌ బకాయిలు చెల్లించాలి

ఏళ్ల తరబడి వర్కింగ్‌, ట్రాన్స్‌పోర్ట్‌, డ్రేజీ, కస్టోడియన్‌ ఛార్జీలతో పాటు 2022-23 రబీ టెండర్‌ ధాన్యానికి సంబంధించిన బకాయిలు కూడా పెండింగ్‌లో ఉన్నాయని మిల్లర్లు తెలిపారు. మరోవైపు మళ్లీ మార్కెట్‌ ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి చేయడం, లైసెన్సులు రెన్యూవల్‌ చేయకుండా ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు.

ఖాళీ బస్తాల సమస్య పరిష్కరించాలి

గత పదేళ్లుగా ఖాళీ బస్తాలు మిల్లుల్లోనే ఉండిపోవడంతో దాదాపు 25 శాతం వరకు పాడయ్యాయని తెలిపారు. వాటికి సంబంధించిన లెక్కలను ప్రభుత్వం ఇప్పటివరకు తేల్చలేదన్నారు. ఖాళీ బస్తాల్లో ఖాప్రా పురుగు చేరడం వల్ల బియ్యం రిజెక్ట్‌ అవుతోందని, సోర్టెక్స్‌ ప్రక్రియలోనూ భారీగా నష్టం వస్తోందని వివరించారు. మిల్లులు నెల రోజుల పాటు మూతపడితే ఒక్కో మిల్లుకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నిర్వహణ భారం పడుతుందని మిల్లర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. రైతుల సంక్షేమంతో పాటు మిల్లర్ల మనుగడను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని నల్లగొండ జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>