కలం, మహబూబ్ నగర్ బ్యూరో : జిల్లాలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushbu Gupta) ఆదేశించారు. బాలల సంక్షేమం, రక్షణకు సంబంధించిన ప్రతి కేసును సీరియస్ గా పరిగణించి, బాలల భద్రత, విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా బాలల సంక్షేమం, రక్షణ కమిటీ సభ్యులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బాల్య వివాహాలు, బాల కార్మికులు, బిక్షాటనకు గురవుతున్న పిల్లల సమస్యలపై అధికారులతో కలెక్టర్ ఖుష్బూ గుప్తా సమీక్షించారు. బాల్య వివాహానికి సంబంధించి హెల్ప్‌లైన్ ద్వారా సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులు పోలీసులతో కలిసి ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. బాల్య వివాహం జరిగే అవకాశం ఉన్నట్లు నిర్ధారణ అయితే వెంటనే అడ్డుకోవాలని, వివాహం ఇప్పటికే జరిగితే నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరచాలని సూచించారు.
ఫిర్యాదుపై ఒకసారి చర్యలు తీసుకున్న తర్వాత కేసును వదిలేయకుండా, సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ అన్నారు. ఫిర్యాదు చేసిన బాలుడు లేదా బాలిక తిరిగి సంప్రదింపులకు రాకపోతే పోలీసుల సహకారంతో వారిని గుర్తించి ఫాలోఅప్ చేయాలని ఆదేశించారు. గ్రామా స్థాయిలో బాల్య వివాహాల నివారణలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామంలో బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం అందిన వెంటనే వారు వ్యక్తిగతంగా ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించడంతో పాటు డీసీపీవో కార్యాలయం, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఫిర్యాదుల కోసం ఎదురుచూడకుండా అధికారులు ప్రోయాక్టివ్‌గా పనిచేసి బాలల హక్కులు, సంక్షేమాన్ని కాపాడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని, జెడ్పీ సీఈవో ఇంచార్జి, డీపీఓ వెంకట రెడ్డి, అదనపు ఎస్పీ ఎన్.బి రత్నం, డీడబ్ల్యూవో జరీనా బేగం, డీఎంహెచ్వో శ్రీనివాసులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

