కలం, నిజామాబాద్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి (Dinesh Patel Kulachari) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలన తెలంగాణ ప్రజలకు చీకటి రోజులుగా మిగిలిపోయిందని అన్నారు.
ప్రజలను మోసం చేస్తోంది..
ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు, ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీని ఒక్కొక్కటిగా పక్కన పెడుతూ ప్రజలను మోసం చేస్తోందని దినేష్ విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని, విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే ఇలాంటి సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు భరోసా లేకుండా పోయింది..
వైద్య రంగంలో కూడా ప్రజలకు సరైన భరోసా లేకుండా పోయిందని దినేష్ మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన సదుపాయాలు, సిబ్బంది, మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని అన్నారు. సాగునీటి విషయంలో ఇందూరు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని దినేష్ పటేల్ కులాచారి అన్నారు. నిజామాబాద్ జిల్లాకు ఎంతోకాలంగా ఉన్న ఎయిర్పోర్ట్ డిమాండ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. జిల్లాకు చెందిన PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి ఇందూరు ఎయిర్పోర్ట్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి సమయం లేదా? అని ప్రశ్నించారు.
స్పష్టమైన లెక్కలు చెప్పాలి..
రైతు భరోసా, రుణమాఫీ, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్, మహిళలకు ఇచ్చిన హామీలు వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన లెక్కలు చెప్పాలని దినేష్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారంలో గొప్పలు చెప్పుకోవడం మానేసి.. 1000 రోజుల్లో ప్రజలకు ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ చేశారు. ఈ ప్రెస్ మీట్ లో జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతన్ కార్ లక్ష్మీనారాయణ, నగ్గోల్ల లక్ష్మీనారాయణ, బద్దం కిషన్, బొబ్బిలి వేణు గోపాల్, చింత శ్రీనివాస్ రెడ్డి, ఓం సింగ్ నాయక్, పురుషోత్తం, అమంద్ విజయ్ కృష్ణ, నాయిడి రాజన్న, శంకర్ రెడ్డి, ఆనంద్, అన్నం గోపి, పడాల భూపతి, మారెడ్డి సురేష్, తదితరులు పాల్గొన్నారు.

