భువనగిరిలో రాజకీయ వేడి.. ఎమ్మెల్యే కుంభం తీవ్ర వ్యాఖ్యలు

కలం, భువనగిరి: భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంపై మంగళవారం జరిగిన దాడి ఘటనపై ఎమ్మెల్యే(Bhuvanagiri MLA)  కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి (Kumbam Anil Kumar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ్యుల కార్యాలయంపై భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య వ్యవస్థకే కళంకమని, ఇది కేవలం రాజకీయ అంశం కాదని.. ప్రజాస్వామ్యంపై జరిగిన ప్రత్యక్ష దాడి అని అన్నారు. బుధవారం స్థానిక క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం జరిగిన ఘర్షణాత్మక ఘటనల అనంతరం కాంగ్రెస్‌ శ్రేణులు అత్యంత సంయమనం పాటించాయని తెలిపారు.

‘క్యాంప్‌ కార్యాలయం ప్రజా వేదిక’

ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉండే ప్రజా వేదిక అని అనిల్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో నినాదాలు, విమర్శలతో రాజకీయ పోరాటం చేయాలే తప్ప దాడులకు పాల్పడే సంస్కృతి భువనగిరి చరిత్రలో ఎన్నడూ లేదన్నారు. ఢిల్లీ పెద్దల అండదండలతో స్థానిక బీజేపీ నాయకులు, బీజేవైఎం శ్రేణులు గూండా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయని ఆయన ఆరోపించారు. నల్గొండలో మంత్రి ఇంటిపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ.. ‘చెప్పేది రాముడి పేరు.. చేసేది రావణకాండ’ అన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు.

‘ఓపికను బలహీనతగా భావించొద్దు’

ఇప్పటివరకు కాంగ్రెస్‌ శ్రేణులు పాటించిన సంయమనాన్ని బలహీనతగా భావించవద్దని ఎమ్మెల్యే హెచ్చరించారు. హద్దులు దాటితే ప్రజాస్వామ్యబద్ధంగానే గట్టి సమాధానం చెబుతామని అన్నారు.

బీఆర్‌ఎస్‌పైనా విమర్శలు

బీఆర్‌ఎస్‌ పార్టీ తీరుపైనా అనిల్‌కుమార్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ‘తెలంగాణలో 1000 రోజుల దగా’ అంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తమ పదేళ్ల పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతూ అసెంబ్లీకి ఒక్కరోజు కూడా హాజరుకాకుండా ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని కేసీఆర్‌పై ఆరోపణలు చేశారు. నైతిక బాధ్యత వహించి ప్రతిపక్ష నాయకుడి పదవికి కేసీఆర్‌ రాజీనామా చేయాలని అనిల్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తంగళ్లపల్లి శ్రీవాణి-రవికుమార్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అవేస్‌ చిస్తి, స్థానిక ప్రజాప్రతినిధులు, పీఏసీఎస్‌ (PACS) చైర్మన్లు, కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ పార్టీ వివిధ విభాగాల ప్రతినిధులు, భారీ సంఖ్యలో కాంగ్రెస్‌ శ్రేణులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>