కలం, స్పోర్ట్స్: పాకిస్థాన్ క్రికెట్లో మరోసారి కాక రేగింది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర వైఫల్యానికి కెప్టెన్ బాబర్ ఆజమ్, కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ నిర్ణయాలే కారణమంటూ పీసీబీ సెలక్షన్ కమిటీ చీఫ్ ఆఖిబ్ జావేద్ (Aaqib Javed) సంచలన వ్యాఖ్యలు చేశారు. సిరీస్ కోల్పోయిన వెంటనే ఏడుగురు ఆటగాళ్లను తప్పించి, టెస్టు కోచ్‌ను మార్చడంపై కూడా ఆయన గట్టిగా స్పందించారు. జట్టు మేనేజ్మెంట్ కీలక నిర్ణయాలు తీసుకోలేకపోయిందని ఆఖిబ్ ఆరోపించారు. అందుబాటులో ఉన్న ఆటగాళ్లను కూడా సరిగ్గా ఉపయోగించలేదని చెప్పారు.
ఆల్‌రౌండర్ లేకపోవడం వల్లే..
ముఖ్యంగా ఉబైద్ షాను తుది జట్టులోకి తీసుకోవాలని బాబర్, సర్ఫరాజ్‌కు సూచించినా ఆ నిర్ణయం అమలు కాలేదని తెలిపారు. పాకిస్థాన్ బౌలింగ్‌లో ఒక వేగవంతమైన పేసర్ అవసరమని ఆఖిబ్ అన్నారు. ఉబైద్ గంటకు దాదాపు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలడని చెప్పారు. బ్యాటింగ్‌లోనూ ఆల్‌రౌండర్ లేకపోవడం సమస్యగా మారిందని పేర్కొన్నారు. సల్మాన్ ఆఘాను తప్పించడం సరైనదేనని, అయితే మహ్మద్ రిజ్వాన్ స్థానంలో ఘాజీ ఘోరీకి అవకాశం ఇవ్వాల్సిందని అన్నారు.
చర్యలు తప్పవు..
కీలక సమయంలో కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే చర్యలు తప్పవని ఆఖిబ్ స్పష్టం చేశారు. ఇప్పటికే సిరీస్ చేజారిపోయిందని, పాకిస్థాన్ కనీసం పోటీ ఇవ్వకపోవడంతో ప్రపంచం తమను చూసి నవ్వుతోందని వ్యాఖ్యానించారు. తుది జట్టు ఎంపికలో అవసరమైతే పీసీబీ జోక్యం చేసుకుంటుందని కూడా ఆయన వెల్లడించారు. జట్టు కూర్పు ప్రణాళికకు తగ్గట్టుగా లేకపోతే మార్పులు చేయాలని మేనేజ్మెంట్కు సూచనలు ఇస్తామని చెప్పారు.
అవకాశం ఇవ్వడంలో తప్పులేదు..
సిరీస్ పోయిన తర్వాత ఏడుగురు కొత్త ఆటగాళ్లను పంపడాన్ని ఆఖిబ్ సమర్థించారు. ఇక పోగొట్టుకోవడానికి ఏమీ లేనప్పుడు యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడంలో తప్పులేదని తెలిపారు. ఇంగ్లండ్‌తో చివరి టెస్టుకు ముందు పాకిస్థాన్ జట్టులో చోటుచేసుకున్న ఈ భారీ మార్పులపై ఆఖిబ్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. కొత్త ఆటగాళ్లు తమకు వచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటారన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.

