కలం, నేషనల్ డెస్క్: నేపాల్ పర్యటన, మానస సరోవర్ యాత్రకు తెలంగాణ నుంచి వెళ్లిన 23 మందిలో ఒకరు క్షేమంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. రంగారెడ్డి జిల్లా చిలుకూరుకు చెందిన అల్లి ఐలేశ్ సురక్షితంగా ఉన్నారని, కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారని తెలంగాణ భవన్ ఆదివారం వెల్లడించింది. ఢిల్లీ నుంచి ఆదివారం రాత్రే హైదరాబాద్‌కు బయలుదేరినట్లు తెలిపింది. మిగిలిన 22 మంది ఆచూకీ కోసం విదేశాంగ శాఖ, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం, నేపాల్ పోలీసులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. తెలంగాణకు చెందిన మరో ఇద్దరు ఎన్నారైలు కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ తరఫున మానస సరోవర్ యాత్రకు వెళ్లగా, వారి ఆచూకీ కూడా తెలియడం లేదని పేర్కొంది.
వెబ్ పోర్టల్‌లో మృతదేహాల ఫొటోలు
నేపాల్ వరదల్లో (Nepal Floods) గల్లంతైన కోసం అక్కడి ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తున్నది. వెలికితీసిన మృతదేహాలను గుర్తించేందుకు వీలుగా వారి ఫొటోలను నేపాల్ డిజాస్టర్ వెబ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలంగాణ భవన్ తెలిపింది. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా గుర్తించగలిగితే డీఎన్ఏ పరీక్ష తప్పనిసరి కాదని నేపాల్ పోలీసులు తెలిపినట్లు తెలంగాణ భవన్ వెల్లడించింది. బంధుత్వాన్ని నిర్ధారించే ఆధారాలు సమర్పించిన తర్వాత మృతదేహాన్ని సంబంధిత కుటుంబానికి అప్పగిస్తారని పేర్కొంది.
నేపాల్‌కు వెళ్లే ముందు సంప్రదించండి
మృతదేహాల గుర్తింపు, కుటుంబాలకు అప్పగింత, స్వదేశానికి తరలింపునకు సంబంధించిన పూర్తి విధివిధానాలను నేపాల్ అధికారులు ఖరారు చేస్తున్నారని తెలంగాణ భవన్ వెల్లడించింది. అధికారిక ప్రక్రియ పూర్తయ్యే వరకు డీఎన్ఏ పరీక్షలు చేయించుకునే ముందు లేదా మృతదేహాల గుర్తింపు కోసం నేపాల్‌కు వెళ్లే ముందు తెలంగాణ భవన్, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కుటుంబ సభ్యులకు సూచించింది. ప్రతి కేసులో అధికారిక నిర్ధారణ పూర్తయిన తర్వాతే తదుపరి సమాచారాన్ని కుటుంబాలకు, ప్రజలకు వెల్లడిస్తామని తెలిపింది.

