గిరిజనుల ఆత్మగౌరవం, సంక్షేమానికి పెద్దపీట : ఎమ్మెల్యే మేఘారెడ్డి

కలం, వనపర్తి: గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (Megha Reddy) అన్నారు. ప్రతి తండాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. శుక్రవారం పెద్దమందడి మండలం మంగంపల్లిలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి గిరిజనుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. నియోజకవర్గంలోని ప్రతి తండాలో ఇల్లు లేని గిరిజన కుటుంబాలను గుర్తించి అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

32 తండాల్లో సేవాలాల్‌ ఆలయాలు..

వనపర్తి నియోజకవర్గంలోని 32 తండా గ్రామపంచాయతీల్లో సేవాలాల్‌ మహారాజ్‌ ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మేఘారెడ్డి తెలిపారు. ఖిల్లాఘణపురం మండల కేంద్రంలో సేవాలాల్‌ మహారాజ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రతి తండాకు రోడ్డు, సాగునీరు..

ప్రతి తండాకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. తాగునీరు, విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను సమర్థవంతంగా వినియోగించి గిరిజన గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేస్తామన్నారు. గిరిజన రైతుల భూములకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కర్నేతండా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు ‘శ్రీశ్రీశ్రీ సంత్‌ సేవాలాల్‌ ప్రాజెక్ట్‌’ గా నామకరణం చేయిస్తున్నట్లు వెల్లడించారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వ స్థాయిలో కృషి చేస్తామని తెలిపారు. ప్రతి తండాలో ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా అవసరమైన చోట హెల్త్‌ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సర్పంచుల పెండింగ్‌ బిల్లుల చెల్లింపునకు చర్యలు

గ్రామాల అభివృద్ధికి పనిచేసిన పాత, కొత్త సర్పంచుల పెండింగ్‌ బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, మహిళలు, పేదలు, యువత, గిరిజనులు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. వనపర్తి నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.2 వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.

24 గంటలు ప్రజల కోసం పనిచేస్తా : ఎమ్మెల్యే

నియోజకవర్గ అభివృద్ధి కోసం 24 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని మేఘారెడ్డి అన్నారు. పదవిని ప్రజలకు సేవ చేసే అవకాశంగా భావిస్తున్నానని, ప్రతి గ్రామం, ప్రతి తండా అభివృద్ధి చెందే వరకు విశ్రమించబోనని స్పష్టం చేశారు. ‘‘ప్రతి తండా అభివృద్ధి చెందాలి.. ప్రతి గిరిజన కుటుంబం ఆత్మగౌరవంతో జీవించాలి.. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలి.. ప్రతి రైతు భూమికి సాగునీరు అందాలి.. ఇదే నా సంకల్పం’’ అని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు వాల్యానాయక్‌, దిశా కమిటీ సభ్యుడు రవినాయక్‌, జిల్లా కాంగ్రెస్‌ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు విజయలక్ష్మి, మంగంపల్లి సర్పంచ్‌ రమేష్‌, మాజీ సర్పంచ్‌ రాధాకృష్ణ, అనకాపల్లి సర్పంచ్‌ ఆంజనేయులు నాయక్‌, కోతులకుంట తండా సర్పంచ్‌ పాండునాయక్‌, మాజీ ఎంపీపీ శంకర్‌నాయక్‌, ఎంపీటీసీ నాగ రాజునాయక్‌తో పాటు పలువురు సర్పంచులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, గిరిజన పెద్దలు, యువత, మహిళలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>