కలం, వెబ్ డెస్క్: అమెరికాలో యువతిని హత్య చేసి భారత్‌కు పరారై వచ్చిన నిందితుడికి తెలంగాణ పోలీసులు (Telangana Police) షాక్ ఇచ్చారు. ఎనిమిది నెలల తరువాత అతడిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన గొడిశాల నిఖిత రావు (26) అమెరికాలో మేరీల్యాండ్‌లో ఉంటూ ఉన్నత విద్యాభ్యాసం చేస్తుండేవారు. గతేడాది డిసెంబర్ 31న తన ఫ్లాట్‌లో దారుణ హత్యకు గురయ్యారు. దీనిపై విచారణ జరిపిన సిటీ పోలీసులు.. ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. అయితే, అప్పటికే అర్జున్ శర్మ అమెరికా వదిలి భారత్ వచ్చేశాడు. అర్జున్ శర్మపై లాలాగూడ పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆగ్రాలో ఉన్నట్లు గుర్తించి..
అర్జున్ శర్మపై నిఘా పెట్టిన లాలాగూడ పోలీసులు.. అతను ఆగ్రాలో ఉంటున్నట్లు పక్కా సమాచారంతో వెళ్లి అరెస్ట్ చేశారు. అనంతరం ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. అమెరికా–భారత్ మధ్య నేరస్థుల మార్పిడి ఒప్పందం ఉండటంతో, త్వరలోనే అర్జున్ శర్మను అమెరికా పోలీసులకు అప్పగించే అవకాశం ఉంది. నిఖిత హత్యకు ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలే కారణమని చెబుతున్నారు. తన కూతురికి అర్జున్ పరిచయం మాత్రమే ఉందని.. అంతకుమించి ఏం లేదని ఆమె తండ్రి ఆనంద్ చెప్పుకొచ్చారు.

