కలం, స్పోర్ట్స్ : భారత టీ20 జట్టు మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav), శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్యను చూసి సరదాగా నవ్వులు పూయించారు. కొలంబోలో జరిగిన ఒక కార్యక్రమంలో వీరిద్దరూ కలిశారు. సూర్యకుమార్ జయసూర్య వద్దకు వెళ్తూ ఆయన ఎంతో ఫిట్‌గా కనిపించారని ప్రశంసించారు. అంతటితో ఆగకుండా జయసూర్య మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారా అని సరదాగా ప్రశ్నించారు. ఆయన వంద శాతం ఫిట్‌గా ఉన్నారని వ్యాఖ్యానించారు. సూర్య మాటలకు జయసూర్య చిరునవ్వు చిందించారు.
ఈ చిన్నపాటి సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. 2026 టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత సూర్యకుమార్ వైఫల్యం బాటపట్టారు. దీంతో ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు ముందు ఆయనను బీసీసీఐ కెప్టెన్సీ నుంచి తప్పించి జట్టు నుంచి దూరం పెట్టింది. ఆయన స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించింది. అయితే శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో జట్టు ఘోరంగా విఫలమైంది.
ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్‌వాష్ అవ్వగా, ఇంగ్లాండ్ చేతిలో 4-0తో టీ20 సిరీస్‌ను ఓడిపోయింది. వర్షం వల్ల తొలి మ్యాచ్ రద్దయింది.సూర్యకుమార్ కెరీర్ ముగిసిపోలేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఆయన ప్రస్తుతం జట్టు ప్రణాళికల్లో లేకపోయినా, దేశవాళీ క్రికెట్లో వరుసగా పరుగులు సాధిస్తే మళ్లీ భారత జట్టులోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశాయి.

