గ్రామసభలు, వార్డు సభల్లో ఓటరు జాబితా : కలెక్టర్ ప్రతిమా సింగ్

క‌లం, మెద‌క్ బ్యూరో : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 27న జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామసభలు, వార్డుసభలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతిమా సింగ్ (Pratima Singh) తెలిపారు. ఈ సభల్లో సంబంధిత పోలింగ్ కేంద్ర స్థాయి అధికారులు తమ పరిధిలోని ఓటరు జాబితాలను ప్రజల సమక్షంలో చదివి వినిపిస్తారని, ఓటర్లు తమ పేరు, చిరునామా, ఇతర వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకునేందుకు అవకాశం కల్పిస్తారన్నారు.

అర్హులైన పౌరులు ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకునేందుకు దరఖాస్తు నమూనా 6, పేరు తొలగింపు లేదా అభ్యంతరాల కోసం నమూనా–7, వివరాల సవరణ కోసం నమూనా–8ను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. గత ఓటరు జాబితాతో అనుసంధానం కాని ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభమైందని, సంబంధిత పోలింగ్ కేంద్ర స్థాయి అధికారి ద్వారా ఓటరుకు లేదా వారి కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేయ‌నున్నట్లు తెలిపారు.

నోటీసులో తెలిపిన తేదీ, సమయం, ప్రదేశంలో ఓటరు స్వయంగా విచారణకు హాజరై అవసరమైన అసలు ధ్రువపత్రాలను చూపించాల్సి ఉంటుందన్నారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 20 వరకు సమీప గ్రామ పంచాయతీ భవనం లేదా వార్డు కార్యాలయంలో విచారణలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆచూకీ లేని, ఇతర ప్రాంతాలకు వెళ్లిన, మరణించిన, రెండు చోట్ల నమోదైన ఓటర్ల జాబితాలను కూడా గ్రామ, వార్డు సభల్లో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచుతామని, అందులో ఏవైనా తప్పులు ఉన్నట్లు గుర్తిస్తే తగిన ఆధారాలతో సవరణకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఎన్నిక‌ల అధికారిణి ప్రతిమా సింగ్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>