భట్టితో భేటీపై రాజగోపాల్ రెడ్డి క్లారిటీ

కలం, నల్లగొండ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) క్లారిటీ ఇచ్చారు. నియోజకవర్గ పెండింగ్ బిల్లులు, అభివృద్ధి నిధుల విషయమై చర్చించేందుకే తాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్దకు వచ్చానని స్పష్టం చేశారు. కొండా మురళి తనకు అక్కడ ఎదురుపడ్డారని, ఆయన రాకతో గానీ, అక్కడ జరిగిన సమావేశంతో గానీ తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు.

కొండా సురేఖ వ్యవహారంలోనూ, హైకోర్టు నిర్ణయం, పార్టీ హైకమాండ్ తీర్పుకే తామంతా కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించారు. దేశంలో రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ అందరి అంతిమ లక్ష్యమని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో ఏఐసీసీ, పార్టీ హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా తామందరం కట్టుబడి ఉంటామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటే తమ మాట అని, క్రమశిక్షణకు తామంతా శిరసావహిస్తామని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ, అంతర్గత వ్యవహారాలు, మీడియా ప్రచారంపై మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రికి గానీ, పార్టీకి గానీ వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. “పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడిన పాత కార్యకర్తలకు న్యాయం చేయాలని మాత్రమే నేను మాట్లాడాను. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ నేతలు పాత కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే భావన ఉంది. కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నదే నా ఉద్దేశం. పార్టీని బలోపేతం చేయడం కోసమే తప్ప, బలహీనపరిచేలా నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు” అని తెలిపారు. తాను మాట్లాడిన తర్వాతే ఇందిరమ్మ ఇండ్ల నిబంధనల్లో మార్పులు వచ్చాయని ఆయన గుర్తుచేశారు.

ఆంధ్ర మీడియా పెత్తనంపై ఆగ్రహం

తెలంగాణలో ఆంధ్ర మీడియా ఛానళ్లు, పత్రికల పెత్తనం ఎక్కువైందని రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “తెలంగాణలో ఉన్న కొన్ని ఆంధ్ర మీడియా సంస్థలు నాలాంటి సీనియర్, నికార్సయిన ఉద్యమ నేతలపై అసత్య కథనాలు రాస్తున్నాయి. ఆ ఛానళ్ల వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరో నాకు బాగా తెలుసు. ఆంధ్ర మీడియా నాలాంటి నాయకుడిని కంట్రోల్ చేయలేదు. నాపై తప్పుడు ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోను.. సంగతి చూస్తా! నేను అనుకుంటే సొంతంగా 100 పేపర్లు, 100 ఛానళ్లు పెట్టగల సామర్థ్యం నాకుంది” అని హెచ్చరించారు.

కాగా, తెలంగాణలో కొండా సురేఖ వివాదం నడుస్తున్న నేపథ్యంలో కొండామురళి డిప్యూటీ సీఎం భట్టిని కలవడం ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో రాజగోపాల్ రెడ్డి సైతం అక్కడే ఉండడం సంచలనంగా మారింది. అయితే, కొండా మురళి.. భట్టిని కలిసిన సమయంలోనే రాజగోపాల్ రెడ్డి ప్రజాభవన్ కు ఎందుకు? వెళ్లారు.. వాళ్లిద్దరి మధ్య జరిగిన చర్చకు ఆయన ఎందుకు? హాజరయ్యారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే తాను కేవలం మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన బిల్లుల కోసమే భట్టిని కలిశానని  రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>