కలం, వెబ్ డెస్క్: ఏపీలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించడం లేదని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ఆరోపించారు. డీఎస్సీలో అక్రమాలపై సవాల్ విసిరినా.. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 52 శాతం లోటు వర్షపాతం నమోదైందని, 688 మండలాలకు గాను 628 మండలాల్లో లోటు వర్షపాతం ఉందని తెలిపారు. కరువు తీవ్రంగా ఉన్నప్పటికీ దాన్ని గుర్తించేందుకు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇష్టపడటం లేదన్నారు. కోస్తా ప్రాంతాల్లోనూ కరువు ప్రభావం తీవ్రంగా ఉందని జగన్ పేర్కొన్నారు. కరువు పరిస్థితులపై సీఎం చంద్రబాబు కుంభకర్ణుడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రణాళిక ఉందా అని జగన్ ప్రశ్నించారు. రెడ్‌బుక్‌ను ఎలా అమలు చేయాలన్న దానిపైనే దృష్టి పెట్టడం తప్ప రైతులను ఎలా ఆదుకుంటున్నారో చంద్రబాబు చెప్పడం లేదని అన్నారు. రైతులకు అండగా ఉన్న పంటల బీమా, సున్నా వడ్డీ పథకాలను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. కరువు పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జగన్ డిమాండ్ చేశారు.

