కలం, నాగార్జున సాగర్: పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నాశనం చేస్తూ కాంగ్రెస్ సర్కారు జారీ చేసిన జీవో నెంబర్.97ను తక్షణమే రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ (Nomula Bhagath) డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్ పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి కాలేజీ నుంచి జెన్కో గెస్ట్ హౌస్ వరకు భారీ ర్యాలీగా వచ్చి మాచర్ల–హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.
ప్రైవేట్ వర్గాలకు అప్పగించే కుట్ర..
ఈ సందర్భంగా నోముల భగత్ మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యను శక్తి పరిధిలోకి తెచ్చి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మూడేళ్లు పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసి నేరుగా బీటెక్ ద్వితీయ సంవత్సరంలో చేరే విద్యార్థులకు ఈ జీవోతో అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలను క్రమంగా ప్రైవేట్ వర్గాలకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఫీజు బకాయిలను సకాలంలో విడుదల చేయకుండా కొత్త విధానాల తెస్తున్నారని మండిపడ్డారు.
విద్యార్థుల హక్కులకు భంగం..
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. జీవో 97తో పాలిటెక్నిక్ విద్యార్థుల హక్కులకు భంగం కలుగుతుందన్నారు. వారి విద్యా ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు, తక్షణమే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నందికొండ, హాలియా, పెదవూర మున్సిపాలిటీల పార్టీ నాయకులు పాల్గొన్నారు.

