కలం, వెబ్‌డెస్క్: ప్రకాశం (Prakasam)లో జిల్లాలో ఘోర లిఫ్ట్ ప్రమాదం (Lift Accident) జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఒంగోలు మార్కెట్ సెంటర్‌లో ఉన్న సూర్య అపార్ట్‌మెంట్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే వినీత అనే మహిళ తన కుమార్తె, మనవడితో కలిసి బుధవారం రాత్రి అపార్ట్‌మెంట్‌కు వచ్చింది. తమ ఫ్లాట్‌కి వెళ్లేందుకు ముగ్గురు లిఫ్ట్ ఎక్కారు. తాముండే ఫ్లోర్ రాగానే లిఫ్ట్ తలుపులు తీసి ముందు కుమార్తె, మనవడు బయటకు వచ్చారు.
తర్వాత వినీత బయటకు వస్తుండగానే లిఫ్ట్ ఒక్కసారిగా కిందికి వెళ్లిపోయింది. కుమార్తె వెంటనే స్పందించి కాపాడేందుకు ప్రయత్నించింది. కానీ, వినీత లిఫ్ట్ తలుపుల మధ్య ఇరుక్కొని తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వినీత మృతి చెందింది. లిఫ్ట్ కేబుల్స్, నిర్వహణలో లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబసభ్యులు, అపార్ట్‌మెంట్‌వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

