కలం, కరీంనగర్: సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న ‘మారు పేర్ల’ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎంపీ గడ్డం వంశీకృష్ణ (MP Vamsi Krishna) డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థను, అందులో పనిచేస్తున్న కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు పవర్ మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీకి లేఖలు రాయడంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. సింగరేణి యాజమాన్యానికి కూడా పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడం బాధాకరమన్నారు.
కోర్టు కేసులు ఉన్నాయంటూ సమస్యను పక్కదారి పట్టించడం సరికాదని ఎంపీ వంశీకృష్ణ అభిప్రాయపడ్డారు. కార్మికులు అనేకసార్లు ధర్నాలు, నిరసనలు, వినతిపత్రాల ద్వారా తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని.. వారికి న్యాయం జరిగేలా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
కార్మికుల చెమటతోనే దేశానికి వెలుగు..
సింగరేణి కార్మికులు (Singareni Workers) తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బొగ్గును వెలికితీస్తూ దేశానికి వెలుగునిస్తున్నారని ఎంపీ (MP Vamsi Krishna) పేర్కొన్నారు. అలాంటి కార్మికులకు న్యాయం జరగకపోవడం మంచిది కాదన్నారు. సింగరేణి సంస్థ కోసం కాకా వెంకటస్వామి అనేక పోరాటాలు చేశారని, కార్మికుల హక్కుల కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు. కార్మికుల కష్టం, వారి సేవలను విస్మరించి కేవలం అధికారుల నిర్ణయాలతో సంస్థను నడపడం సరైన విధానం కాదన్నారు.
భవిష్యత్తులో సింగరేణికే ఇబ్బందులు..
కార్మికుల సమస్యలను పట్టించుకోకపోతే భవిష్యత్తులో సింగరేణికే ఇబ్బందులు వస్తాయని వంశీకృష్ణ అభిప్రాయపడ్డారు. కార్మికుల బాధలను పరిష్కరించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. వారి సమస్యలకు పరిష్కారం చూపకపోతే ఆ బాధ్యత అధికారులపైనే ఉంటుందని హెచ్చరించారు. సింగరేణి సంస్థ దేశానికి ఎంతో కీలకమైనదని చెప్పుకొచ్చారు. సింగరేణి నడిస్తేనే ఈ దేశానికి వెలుగు అని పేర్కొంటూ, కార్మికులు కోరుతున్న మారు పేర్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మరోసారి కోరారు.
Also Read : అగ్గిపెట్టె రావు పాపాలన్నీ తెలుసు.. హరీశ్‌పై పొంగులేటి సెటైర్లు!
Follow Us On: X(Twitter)

