కలం, కరీంనగర్ బ్యూరో: చేయూత పింఛన్లకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో డీఆర్డీఓ గీత, మెప్మా పీడీ స్వరూపరాణి మాట్లాడుతూ ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్లు మినహా మిగతా అన్ని రకాల పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, దివ్యాంగులు తదితర వర్గాలకు చెందిన వారు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కొత్త పింఛన్ల దరఖాస్తుల పరిశీలనలో ఆహార భద్రత కార్డునే ప్రామాణికంగా పరిగణిస్తున్నట్లు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ (Karimnagar Collector) చిత్రా మిశ్రా (Chitra Mishra) మాట్లాడుతూ పింఛన్లకు సంబంధించిన నిబంధనలలో ఎలాంటి మార్పులు చేయలేదని, గతంలో అమలులో ఉన్న నిబంధనలనే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు
పింఛన్లకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం ప్రతి గ్రామపంచాయతీ, మండల కేంద్రం, మున్సిపాలిటీ, నగరపాలికలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు తమ సందేహాలను అక్కడ నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు. గతంలో గ్రామసభలు, వార్డుసభలు, ప్రజాపాలన వారోత్సవాల సమయంలో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే అప్పట్లో దరఖాస్తు చేయని వారు లేదా అవసరమైన పత్రాలు సమర్పించని వారు ప్రభుత్వం సూచించిన పత్రాలతో ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇంటింటి సర్వే తర్వాత అర్హుల గుర్తింపు
దరఖాస్తుల పరిశీలన అనంతరం అధికారులు ఇంటింటికి వెళ్లి అర్హులను గుర్తిస్తారని కలెక్టర్ తెలిపారు. అర్హత ప్రమాణాల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డీఆర్వో స్వామి, వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 225 దరఖాస్తులు అందగా, అత్యధికంగా కరీంనగర్ నగరపాలక సంస్థకు 58, గృహ నిర్మాణ శాఖకు 56 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ప్రజావాణి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, చీఫ్ సెక్రటరీ కార్యాలయం నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. 30 రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయాలని సూచించారు.

