కలం, స్పోర్ట్స్ : ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో (BWF World Championships 2026) ప్రపంచ నంబర్‌వన్ షట్లర్ అన్ సెయంగ్(An Se young) శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో బల్గేరియాకు చెందిన కలొయానా నల్బంటోవాపై 21-14, 21-13 తేడాతో వరుస గేములలో విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం అన్ సెయంగ్ చీలమండ గాయంపై ఆందోళన వ్యక్తం చేసింది. మ్యాచ్ ముగిసిన వెంటనే ఆమె చీలమండకు ఐస్ పెట్టుకుంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం అవసరమని తెలిపింది. ప్రస్తుతం తన శరీరం బాగానే ఉందని చెప్పిన అన్ సెయంగ్.. చీలమండలో స్వల్ప నొప్పి మాత్రం ఇంకా ఉందని వెల్లడించింది. త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్ సాధించాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది.
చీలమండ గాయం నుంచి కోలుకునే ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని అన్ సెయంగ్ (An Se young) తెలిపింది. తదుపరి మ్యాచ్‌కు మరింత మెరుగైన స్థితిలో ఉండేందుకు ప్రస్తుతం రికవరీపై దృష్టి పెడుతున్నట్లు చెప్పింది. నల్బంటోవాపై వరుస గేములలో విజయం సాధించినప్పటికీ.. మ్యాచ్ అనుకున్నంత సులభంగా సాగలేదని పేర్కొంది. ప్రత్యర్థి షాట్లు, దాడులు బలంగా ఉన్నాయని అన్ సెయంగ్ తెలిపింది. అయితే తాను ప్రశాంతంగా ఉంటూ ప్రతి పాయింట్‌పై దృష్టి పెట్టడంతో విజయం సాధించగలిగానని వివరించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పోటీ తీవ్రంగా ఉంటుందని ఆమె అంగీకరించింది.
బిజీ షెడ్యూల్ మధ్య శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో ముఖ్యమని అన్ సెయంగ్ పేర్కొంది. భారత్‌లో ఆడటం తనకు ఎంతో ఇష్టమని తెలిపింది. ఈ ఏడాది ఇండియా ఓపెన్‌లో పాల్గొన్న ఆమె.. ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగింది. బ్యాడ్మింటన్‌తో పాటు ఇంగ్లీష్ భాషపై కూడా అన్ సెయంగ్ దృష్టి పెడుతోంది. వారానికి మూడు సార్లు ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకుంటున్నట్లు వెల్లడించింది. తన ఇంగ్లీష్‌ను మరింత మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.
Also Read : దీక్షా దాగర్‌కు షాక్: టాప్-10 నుంచి అవుట్!
Follow Us On: Instagram

