కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణలో పేద కుటుంబాలకు అండగా నిలిచిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్ జాతీయ నాయకుడు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే కల్యాణలక్ష్మి(Kalyana Lakshmi), షాదీ ముబారక్ (Shaadi Mubarak) పథకాల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. గత కేసీఆర్ ప్రభుత్వం “ఆడబిడ్డ భారం కాదు.. ప్రతి కుటుంబానికి భరోసా” అనే ఉద్దేశంతో ఈ పథకాలను అమలు చేసిందని గుర్తుచేశారు.
పేద తల్లిదండ్రులు తమ కుమార్తెల వివాహాల కోసం అప్పులపాలు కాకుండా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆర్థికంగా అండగా నిలిచాయని తెలిపారు. అయితే, ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉన్న కల్యాణలక్ష్మి అంశంపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. హైకోర్టు నాలుగుసార్లు గడువు ఇచ్చినా ప్రభుత్వం ఇప్పటివరకు కౌంటర్ అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేకపోయిందో సమాధానం చెప్పాలని పువ్వాడ డిమాండ్ చేశారు. లక్షలాది మంది పేదింటి ఆడబిడ్డల ప్రయోజనాలకు సంబంధించిన ఈ అంశంలో కోర్టు ముందు ప్రభుత్వం బలమైన వాదనలు ఎందుకు వినిపించలేకపోతోందో స్పష్టం చేయాలని అన్నారు.
ప్రభుత్వ ధోరణిని చూస్తుంటే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేయడం లేదా రద్దు చేయడం కోసం కాలయాపన చేస్తున్నట్లు అనిపిస్తోందని పువ్వాడ ఆరోపించారు. తెలంగాణ ఆడబిడ్డల భవిష్యత్తుతో ఆడుకుంటూ సంక్షేమ పథకాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే, ఆడబిడ్డలు, వారి కుటుంబాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

