కలం, వెబ్ డెస్క్ : నేడు హైదరాబాద్లోని జలసౌధలో జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. నేడు జరగాల్సిన సమావేశాన్ని ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కేఆర్ఎంబీ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో, సమావేశానికి హాజరుకాలేమని ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి తెలిపింది. ఏపీ విజ్ఞప్తి మేరకు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని ఈ నెల 24కు వాయిదా వేశారు.
కాగా, ఈ సమావేశంలో కృష్ణా జలాల వినియోగం, నీటి కేటాయింపులు తదితర అంశాలపై ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక అంశాలు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉండటంతో 24న జరిగే భేటీపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే గోదావరి జలాలపై ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరగాల్సిన జీఆర్ఎంబీ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 18న జరగాల్సిన ఈ సమావేశాన్ని వాయిదా వేశామని.. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని జీఆర్ఎంబీ బోర్డు తెలిపింది.

