క‌రీంన‌గ‌ర్‌లో హెచ్ఐవీ ప్రమాద ఘంటికలు!

కలం, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లాలో హ్యుమన్ డెఫిషీయన్సీ వైరస్ (HIV) ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మేజర్ అయిన ఇద్దరు ఆడ, మగ పరస్పర అంగీకారంతో దాంపత్య జీవితం గడపొచ్చనే కోర్టు తీర్పుల ఫలితంగా హెచ్ఐవీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ వ్యాధికి అడ్డుకట్ట వేయాలని భావించి ప్రభుత్వం ఈ రెండు నెలల పాటు అవగాహన కల్పించాలని నిర్ణయించింది.

ఉమ్మడి జిల్లాలో హెచ్ఐవీ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీల రాక, అవగాహన లేమి కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిహార్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి రైస్ మిల్లులు, గ్రానైట్, స్టోన్‌క్రషర్, ఇటుక బట్టీల్లో పనిచేయడానికి కార్మికులు పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లాకు వస్తున్నారు. భవన నిర్మాణ పనుల్లోనూ ఇతర ప్రాంతాల కూలీలు ఎక్కువగా ఉన్నారు. ఉపాధి కోసం ముంబై, భివండి, గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు కూడా ఉన్నారు.ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో హెచ్ఐవీ కేసులు నిశ్శబ్దంగా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 11,885 మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి ద్వారా ఈ వ్యాధి మరింత వ్యాప్తి చెందుతోందని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోనే నివసిస్తూ ఇతర జిల్లాల్లో మందులు వాడుతున్న వారు ఉన్నారు.

ఉమ్మడి జిల్లా వివరాలివే..

బాధితులు: 11,885
అవగాహన సదస్సులు: 800
మందుల పంపిణీ కేంద్రాలు: 3
ఐసీటీసీ కేంద్రాలు: 13

26 హైరిస్క్‌ గ్రామాలు

ఉమ్మడి జిల్లాలో 26 హైరిస్క్‌ గ్రామాలను గుర్తించారు. ఆయా గ్రామాల్లో ప్రత్యేక పరీక్షలు నిర్వహించడంతో పాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం కార్యాచరణ చేపట్టింది. ఎక్కువ శాతం హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉన్న గ్రామాల్లో ప్రత్యేక క్యాంపుల ద్వారా పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా వైద్యం, చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టనున్నారు.

వ్యాధి వ్యాప్తి ఇలా..

విశృంఖల శృంగారం
ఒకరు వాడిన ఇంజక్షన్లను మరొకరు ఉపయోగించడం
వివాహేతర సంబంధాలు
వ్యభిచార గృహాలకు వెళ్లడం
స్వలింగ సంపర్కం

ఉమ్మడి జిల్లాలో కార్యాచరణ

ఉమ్మడి జిల్లాలో 200 గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీంతో పాటు 100 విద్యా సంస్థల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో చైతన్యం తీసుకురానున్నారు. ప‌ది, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు అవగాహన కల్పించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించనున్నారు. ఎన్‌సీసీ క్యాడెట్లు, నెహ్రూ యువ కేంద్రం ప్రతినిధులను కూడా భాగస్వాములను చేసి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టే విధంగా సమన్వయం చేస్తున్నారు. హెచ్‌ఐవీ విషయంలో జాగ్రత్తలు పాటించాలని వాహన ప్రదర్శనలు కూడా చేపట్టేందుకు ప్రణాళిక చేసుకున్నారు.

అందుబాటులోకి పరీక్షలు

హెచ్‌ఐవీ పరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చారు. పట్టణాల్లోని ఆస్పత్రుల్లోని ఏఆర్‌టీ కేంద్రాల్లో మాత్రమే పరీక్షలు చేసేవారు. గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానాల్లో పరీక్షలను అందుబాటులోకి తెచ్చారు. ఉమ్మడి జిల్లాలో సంచార వాహనం ఏర్పాటు చేశారు. దీని ద్వారా అవసరమున్న గ్రామానికి వెళ్లి పరీక్షలు చేపడుతున్నారు. హెచ్ఐవీ నివారణకు అవగాహనే ఆయుధం. అప్రమత్తంగా ఉండాలని, అనుమానం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>