నల్లతుమ్మ పేరుతో సండ్ర కలప స్మగ్లింగ్.. ఖమ్మంలో గుట్టురట్టు

కలం, ఖమ్మం బ్యూరో: అటవీ శాఖ పర్మిషన్ పత్రాలనే మార్చేసి.. నల్ల తుమ్మ స్థానంలో విలువైన సండ్ర కలపను పాన్ మసాలా ‘కత్తా’ తయారీకి తరలిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా గుట్టును ఖమ్మం (Khammam ) సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు రట్టు చేశారు. కేసులో ప్రధాన సూత్రధారులైన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ మహ్మద్ సర్వర్ ఆదివారం వెల్లడించారు. ​ఏసీపీ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ గౌడ్ దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు.

​ట్యాంపరింగ్ మోసం ఇలా..

సూర్యాపేట జిల్లా, మోతే మండలం గోప్య తండాకు చెందిన కలప వ్యాపారి కొర్ర శివ, ఖమ్మం ఫారెస్ట్ ఆఫీస్ నుంచి వేరే వ్యక్తుల పేరిట ‘నల్ల తుమ్మ’ కర్ర కోసం పొందిన అనుమతి పత్రాలను సంపాదించాడు. వాటిపై ఉన్న వివరాలను చాకచక్యంగా ట్యాంపరింగ్ చేసి, ‘సండ్ర కర్ర’ పర్మిషన్‌గా మార్చేశాడు. అనంతరం అయ్యగారూపల్లి, కురవి, సీరోలు, కంపెళ్ళి, మహబూబాబాద్ ప్రాంతాల్లో నరికిన సండ్ర చెట్లను ఈ నకిలీ పత్రాల ఆధారంగా విజయవాడకు చెందిన రాధే శ్యామ్‌కు విక్రయించాడు.

​పాన్ మసాలా కత్తా తయారీకే..

విజయవాడకు చెందిన రాధే శ్యామ్ ఈ సండ్ర కలపను మధ్యప్రదేశ్, జాబువాలోని ‘AM ఎంటర్ప్రైజెస్’ యజమాని అబ్దుల్ రహేమాన్‌కు సరఫరా చేసేవాడు. అక్కడి పాన్ మసాలాల్లో వాడే ‘కత్తా’ (కాచు) తయారీకి ఈ కలపను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు దాదాపు 9 లారీల సండ్ర కలపను ఇతర రాష్ట్రాలకు తరలించినట్లు తేలింది. కాగా, కొర్ర శివపై గతంలో వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోనూ అటవీ కేసులు ఉన్నాయి. ​ఈ ముఠాలోని కొర్ర శివ, రాధే శ్యామ్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు, ఈ నెట్‌వర్క్‌లో ప్రమేయం ఉన్న ఇతరుల కోసం విచారణ ముమ్మరం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>