కలం, స్పోర్ట్స్ : మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో (Madras International Circuit) జరిగిన ఇండియన్ నేషనల్ రేసింగ్ ఛాలెంజ్ 2W-2026 తొలి రౌండ్ ఆదివారం ముగిసింది. ఉత్కంఠభరితంగా సాగిన పోటీల్లో చెన్నైకి చెందిన 18 ఏళ్ల రక్షిత్ దేవ్ (Rakshith Dave) సూపర్ స్పోర్ట్ 301-400 సీసీ విభాగంలో సంచలన విజయాన్ని అందుకున్నాడు. శనివారం జరిగిన రేసులో తీవ్ర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న రక్షిత్ దేవ్.. ఆదివారం ఆఖరి స్థానం నుంచి రేసును ప్రారంభించి అద్భుతంగా పుంజుకున్నాడు. తొలుత బెంగళూరుకు చెందిన చిరంత్ విశ్వనాథ్ అగ్రస్థానంలో నిలిచాడు. అయితే చివరి ల్యాప్‌లో తన సహచరుడు సార్థక్ చవాన్‌ను ఢీకొట్టడంతో విచారణ అనంతరం చిరంత్‌కు 30 సెకన్ల పెనాల్టీ విధించారు. దీంతో అతడు ఏడో స్థానానికి పడిపోయాడు. ఫలితంగా రెండో స్థానంలో నిలిచిన రక్షిత్ దేవ్ విజేతగా నిలిచాడు. రాహిల్ పిల్లరిశెట్టి కూడా రేసులో గట్టి పోటీ ఇచ్చాడు.
కబిలేష్‌కు తొలి విజయం
సూపర్ స్టాక్ 301-400 సీసీ విభాగంలో 16 ఏళ్ల కబిలేష్ రజిని కృష్ణన్ తొలి విజయాన్ని నమోదు చేశాడు. 11 సార్లు నేషనల్ ఛాంపియన్‌గా నిలిచిన రజిని కృష్ణన్ కుమారుడైన కబిలేష్.. గతేడాది గాయం నుంచి కోలుకుని ఈ ఘనత సాధించాడు. కుమారుడి విజయంపై రజిని కృష్ణన్ సంతోషం వ్యక్తం చేస్తూ.. ముందుకు సాగాల్సిన ప్రయాణం ఇంకా ఎంతో ఉందని పేర్కొన్నారు.
ఆన్ జెన్నిఫర్ అదుర్స్
సూపర్ స్టాక్ 165 సీసీ విభాగంలో ఏకైక మహిళా రేసర్ ఆన్ జెన్నిఫర్ సత్తాచాటింది. రేసు ప్రారంభంలో వెనుకబడినప్పటికీ అద్భుతంగా పుంజుకుని విజయం సాధించింది. తన రేసింగ్ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ రేస్ అని ఆమె తెలిపింది. ఈ వారంలో ఆన్ జెన్నిఫర్‌కు ఇది రెండో విజయం కావడం విశేషం.
ఇతర విభాగాల్లో విజేతలు
ప్రో-స్టాక్ 200 సీసీ రేసులో అబ్దుల్ బాసిమ్ విజేతగా నిలవగా, అమర్‌నాథ్ మీనన్ రెండో స్థానంలో నిలిచాడు. స్టాక్ 165 సీసీ విభాగంలో హరి హరన్, స్టాక్ 301-400 సీసీ విభాగంలో అశ్విన్ ఆర్ విజయాలు సాధించారు. ఎక్స్‌పర్ట్ ఆర్ఆర్ 310 రేసులో కమల్ నవాస్ అగ్రస్థానంలో నిలిచాడు. రూకీ విభాగంలో దేవ్ అగస్త్య విజేతగా నిలవగా.. మంచిర్యాలకు చెందిన పోతు విఘ్నేష్ మూడో స్థానాన్ని దక్కించుకుని సత్తాచాటాడు.

