కలం, నేషనల్ డెస్క్: కాక్రోచ్ జనతా పార్టీ (CJP), దానికి మద్దతు పలికిన యువతకు కష్టాలు చుట్టుముట్టనున్నాయి. నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా గత నెలలో ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా జరిగిన ఉద్యమం నేపథ్యంలో కేసులకు రాష్ట్రాల పోలీసులు చర్యలు ప్రారంభించారు. తీవ్ర నేరారోపణలతో ఎఫ్ఐఆర్ నమోదైతే అలాంటి యువత చదువుల కోసం కావొచ్చు, ఉపాధి కోసం కావొచ్చు విదేశాలకు వెళ్లేందుకు అవకాశం ఉండదు. ఇమిగ్రేషన్ రూల్స్‌లో భారీ మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
‘కాక్రోచ్’, జెన్ జీ ఒత్తిళ్లకు తలొగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో రాజీనామా చేయించడం బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. ప్రతిపక్షాలనే లెక్కచేయని పరిస్థితుల్లో సీజేపీ యూత్ డిమాండ్లపై వెనక్కి తగ్గడం ఆ పార్టీలోనే చర్చకు దారితీసింది. పన్నెండేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ వివిధ రాజకీయ పార్టీల ఒత్తిడిని అధిగమించినా ఇప్పుడు మాత్రం యువతను చర్చల ద్వారా కేంద్ర మంత్రులు ఒప్పించలేకపోయారన్న కామెంట్లు ఆ పార్టీ లీడర్ల నుంచి వినిపిస్తున్నాయి. ఫస్ట్ టైమ్ తలొగ్గడంతో భవిష్యత్తులోనూ ఇలాంటి డిమాండ్లు మరికొన్ని రావొచ్చని, ప్రతీసారి ప్రభుత్వం వెనకడుగు వేయాల్సి వస్తుందేమోననే ఆందోళన కూడా ఆ లీడర్ల నుంచి వ్యక్తమవుతున్నది. దీంతో సీజేపీ యూత్ పట్ల కంటికి కనిపించని తీరులో కఠినంగా వ్యవహరించడంపై అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లే యూత్‌కు (సీజేపీతో సంబంధాల్లో ఉన్న) రానున్న రోజుల్లో కొన్ని చిక్కులు రావొచ్చని ఆ వర్గాల నుంచి ప్రాథమిక సమాచారం అందుతోంది.
యూత్ ఫ్యూచర్ పై ప్రభావం!
కేంద్ర మంత్రులతో చర్చల సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు పోలీసులు పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేయాలని సీజేపీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. కేసులను మాఫీ చేయనున్నట్లు కేంద్ర మంత్రులు సైతం హామీ ఇచ్చారు. కేసుల్ని ఎత్తివేయలేదంటూ సీజేపీ ప్రతినిధులు పలు సందర్భాల్లో ప్రకటించారు. అయినప్పటికీ ఇప్పటికీ పలు రాష్ట్రాల పోలీసులు కనిపించని తీరులో నిఘా వేస్తున్నారని, కుటుంబ సభ్యులను ఒత్తిడికి గురిచేస్తున్నారని తాజాగా సీజేపీ నాయకులు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్ ఓపెన్‌గానే కామెంట్ చేశారు. కేంద్రం ఇచ్చిన మాటను నిలుపుకోలేదనే అసంతప్తి, ఆగ్రహాన్ని వెలిబుచ్చుతూనే.. రానున్న రోజుల్లో విద్యా సంస్థల సమస్య మీద ఆందోళన చేస్తామని, మార్పులు జరిగేంత వరకు కేంద్రం మీద ఒత్తిడి పెంచుతామని అభిజిత్ దీప్కే వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ నేతల్లో కూడా ఢిల్లీ స్థాయిలో మరో రకమైన చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే సీజేపీ యూత్ కదలికలు, వారు చేపట్టిన ఆందోళనల వెనక ఎవరున్నారని ఆరా తీసే పని ముమ్మరంగా జరుగుతున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. రానున్న రోజుల్లో ఆ అతీత శక్తిని కనిపెట్టడం టాస్క్‌గా మారింది.
విదేశీ ప్రయాణాల కట్టడితోనే కంట్రోల్
జెన్ జీ యూత్, విద్యార్థులు డిమాండ్ల సాధన కోసం మెట్టు దిగడానికి సిద్ధంగా లేకపోవడం.. లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని సీజేపీతో టచ్‌లో ఉన్నవారి వివరాలను సేకరిస్తూనే వారి యాక్టివిజం వివరాలను ఇంటెలిజెన్స్ వర్గాలు వెలికి తీస్తున్నాయి. జంతర్ మంతర్ ఆందోళనలో క్రియాశీలకంగా, మిలిటెంట్‌గా పాల్గొన్నవారి వివరాలను ఇప్పటికే సేకరించగా, భవిష్యత్తులో వారి విదేశీ ప్రయాణాలకు బ్రేక్ వేయడానికి ఉన్న మార్గాలపై ప్రభుత్వ వర్గాలు దృష్టి పెట్టినట్లు సమాచారం అందుతోంది. వారిపై ఉన్న కేసులు, నేరారోపణలు, సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా, ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన.. ఇలాంటి అంశాలను విశ్లేషిస్తున్నట్లు తెలిసింది. విదేశీ ప్రయాణాల సందర్భంగా పాస్‌పోర్ట్, ఇమ్మిగ్రేషన్.. ఇలాంటి పలు అంశాల్లో ఎక్కడెక్కడ రిమార్కులు ఉన్నాయో వెలికితీసి ఆ రూల్స్ మేరకు వారి ప్రయాణానికి బ్రేక్ వేయడంపై కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఆలోచనలు జరుగుతున్నట్లు ఢిల్లీలో జోరుగా చర్చ నడుస్తున్నది. కొద్దిమందిపై సీరియస్ చర్యలు తీసుకుంటే యూత్ ఒక అడుగు వెనక్కి తగ్గుతారన్నది లీడర్ల వాదన. అభిజిత్ దీప్కే విదేశంలో ఉండగానే సీజేపీ ప్రకటన, సోషల్ మీడియాలో పోస్టులతో పాపులర్ అయిన విషయాన్ని వారు గుర్తుచేసుకుంటున్నారు.
ముల్లును ముల్లుతోనే తీసే ప్లాన్
జెన్ జీ యూత్ ఎక్కువగా వారి కెరీర్, జాబ్ ఆపర్చునిటీస్, ప్రొఫెషన్లో స్పెషలైజేషన్, దానికి తగిన అదనపు సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేయడం.. ఇలాంటివాటి మీదనే దృష్టి పెట్టనున్న నేపథ్యంలో వాటికి అవకాశం లేకుండా అడుగులు వేయాలన్నది పలు రాష్ట్రాల పోలీసుల ఆలోచనగా కనిపిస్తున్నది. సీజేపీ యూత్‌లో కొద్దిమందిని గుర్తించిన ఇంటెలిజెన్స్ వర్గాలు.. ఆ యూత్ నివసించే సొంత రాష్ట్రాల్లోని పోలీసుల ద్వారా అవసరమైన అదనపు వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్యూచర్లో విదేశీ ప్రయాణం చేసే సమయానికి ఇమ్మిగ్రేషన్, పాస్‌పోర్ట్ రూల్స్ కు అనుగుణంగా వారి ప్రయాణానికి కొర్రీలు పెట్టి బ్రేక్ వేయాలన్నది ఈ వ్యూహం వెనక ఉద్దేశంగా కనిపిస్తున్నది. ‘కాక్రోచ్’తో టచ్‌లో ఉన్నవాళ్లు ఫ్యూచర్ గురించి ఏం కోరుకుంటున్నారో అది సాకారం కాకుండా ఉండేలే ముల్లును ముల్లుతోనే ఢీకొట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాక్రోచ్ పార్టీలోని వారిపై కేసులు పెండింగ్‌లో ఉండడం, విచారణ దశలో ఉండడం, దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన చట్టాలు, సెక్షన్ల కింద అభియోగాలు నమోదు కావడం.. ఇలాంటివి ఈ ప్రణాళికలో భాగంగా కనిపిస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశమున్నది.

