కలం, వనపర్తి: బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేసేటప్పుడు హద్దులు దాటొద్దని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి (MLA Megha Reddy) హెచ్చరించారు. విహారయాత్రలు చేస్తూ ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. ఎన్నికల ఓటమి నుంచి బయటపడలేక తప్పుడు సమాచారంతో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
2014–23 మధ్య బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నిబంధనలకు మించి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు నీరు తరలిపోతుంటే ఎందుకు స్పందించలేదన్నారు. జూరాల ఎల్‌ఎంసీ, రాజీవ్ భీమా ఫేజ్–2, కేఎల్‌ఐ ద్వారా వనపర్తి నియోజకవర్గంలో 90,741 ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. ఈ ప్రాజెక్టుల్లో ఎక్కువ భాగం కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో నిర్మించినవేనని తెలిపారు. బీఆర్‌ఎస్ పాలనలో వనపర్తి నియోజకవర్గానికి ఒక్క ఎకరా అదనంగా సాగునీరు అందించారా? అని ఎమ్మెల్యే మేఘారెడ్డి సవాల్ చేశారు.
పాలమూరు ప్రాజెక్టుకు రూ.9 వేల కోట్లు..
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వం వదిలేసిందని ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు ప్రాజెక్టుకు రూ.5 వేల కోట్లు, ఇతర పెండింగ్ బిల్లులకు రూ.4 వేల కోట్లు చెల్లించిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును తొందరపడి పూర్తి చేసి చివరకు సమస్యాత్మకంగా మార్చారని విమర్శించారు. కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యే అయితే, తాను వనపర్తి ఎమ్మెల్యేనని.. ఆయన పెద్ద గొప్పేం కాదన్నారు.
ఆగస్టు ఒకటో తేదీన ఎల్లూరు, 2న సింగోటం–జొన్నలబొగుడ, 3న గుడిపల్లి రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేశామని ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. సర్ ప్రక్రియలో భాగంగా డబుల్ ఓట్ల తొలగింపుతో వనపర్తి, పెబ్బేరు పట్టణాల్లో ఓట్ల సంఖ్య తగ్గిందన్నారు. వనపర్తి సెగ్మెంట్‌లో 86 శాతం ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ఈ నెలాఖరులో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వనపర్తికి రానున్నారని వెల్లడించారు. డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ మాధవి రమేష్, వైస్ ఛైర్మన్ మధుసూదన్‌గౌడ్, పట్టణ అధ్యక్షుడు కదిరి రాములు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

