ఇసుక తవ్వకాలపై ముమ్మర తనిఖీలు: మహబూబ్ నగర్ కలెక్టర్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టేందుకు తహసీల్దార్లు అప్రమత్తంగా వ్యవహరించాలని మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. సమాచారం అందిన వెంటనే క్షేత్రస్థాయిలో ముమ్మర తనిఖీలు నిర్వహించి పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. గురువారం అన్ని మండలాల తహసీల్దార్లతో వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించారు. కోయిల్‌కొండ, మూసాపేట, మిడ్జిల్, దేవరకద్ర, చిన్నచింతకుంట, జడ్చర్ల మండలాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపుపై వచ్చిన ఫిర్యాదులు, నివేదికలను కలెక్టర్ సమీక్షించారు. కోయిల్‌కొండ మండలం శివారం గ్రామంలో ఇసుక తవ్వకాల కారణంగా ప్రభుత్వ భూమికి నష్టం జరిగినట్లు వచ్చిన నివేదికపై వివరణ తీసుకున్నారు.

బాధ్యుల నుంచి రికవరీ..

మిడ్జిల్ మండలంలో సీజ్ చేసిన ఇసుక వేలం వెంటనే నిర్వహించాలని మైనింగ్ శాఖ అధికారులను కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. అక్రమంగా తరలించిన ఇసుక వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి నిబంధనల ప్రకారం బాధ్యుల నుంచి రికవరీ చేయాలని సూచించారు. మీడియాలో ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి వార్తలు వచ్చినప్పుడు సంబంధిత తహసీల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలించి తీసుకున్న చర్యలను తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. అధికారులు ఒకరిపై మరొకరు బాధ్యతలు బదిలీ చేసుకునే పరిస్థితి ఉండకూడదని, తమ పరిధిలో జరుగుతున్న ప్రతి అంశంపై తహసీల్దార్లకు పూర్తి అవగాహన ఉండాలని స్పష్టం చేశారు.

ప్రతి మండలం నుంచి 15 మంది ఎంపిక..

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నామని, ప్రతి మండల నుంచి 15 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ జాబితాను వెంటనే పంపాలని కలెక్టర్ ఆదేశించారు. రెండు పడక గదుల ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేసి, పెండింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఎల్-1 జాబితాలోని అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారి వివరాలను హౌసింగ్ పీడీ కార్యాలయానికి పంపించాలని సూచించారు. ప్రజాపాలన పోర్టల్‌లోని దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకుని అర్హులను ఎల్-1, ఎల్-2, ఎల్-3 కేటగిరీలుగా గుర్తించాలని తెలిపారు. గృహాల కేటాయింపులో మార్గదర్శకాలు, రిజర్వేషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

రెండు రోజుల్లో లబ్ధిదారుల జాబితా..

పెండింగ్‌లో ఉన్న ఇళ్ల ఎంపిక ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారుల జాబితాలను సంబంధిత హౌసింగ్ పీడీ కార్యాలయానికి పంపాలని కలెక్టర్ ఆదేశించారు. భూ భారతి పోర్టల్‌లో 60 రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. సర్వే సమస్యలు ఉన్న ప్రాంతాల్లో ల్యాండ్ యాప్‌లోని జీపీఎస్ కోఆర్డినేట్ల ఆధారంగా స్కెచ్‌లు సిద్ధం చేసి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

గ్రామాల రీసర్వే పనులను వేగవంతం చేస్తూ గ్రామ సరిహద్దుల నిర్ధారణ, ప్రభుత్వ భూముల డీ మార్కేషన్‌ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. కుటుంబ రిజిస్ట్రేషన్లకు సంబంధించి దరఖాస్తులను వేగంగా పూర్తి చేయాలన్నారు. చనిపోయిన వారి వివరాలను జాగ్రత్తగా పరిశీలించి కుటుంబ రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలను జారీ చేయాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి హరిప్రియ, డీఆర్వో నిర్మల, ఆర్డీవో నవీన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ అశోక్, జిల్లా మైనింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>