కలం, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్రాంచైజీతో విభేదాల నేపథ్యంలో ఆ జట్టును వీడేందుకు హార్దిక్ పాండ్యా (Hardik Pandya) సిద్ధమవుతున్నట్లు క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన కొత్త ఫ్రాంచైజీ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తన మాజీ జట్టు గుజరాత్ టైటాన్స్‌లోకి తిరిగి వెళ్లేందుకు హార్దిక్ జరిపిన చర్చలు కీలక మలుపు తిరిగినట్లు సమాచారం.
హార్దిక్ పాండ్యా నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ 2022లో ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. అనంతరం 2024 ఐపీఎల్ సీజన్‌కు ముందు ఆయన ముంబై ఇండియన్స్‌కు తిరిగి వెళ్లారు. ఆ సమయంలో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్‌కు బాధ్యతలు అప్పగించడంతో ముంబై అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. హార్దిక్ ముంబైకి వెళ్లిన తర్వాత గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీని శుభ్‌మన్ గిల్ (Shubman Gill) చేపట్టాడు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత హార్దిక్ మళ్లీ గుజరాత్ జట్టులోకి రావాలని యాజమాన్యంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. హార్దిక్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవడానికి గుజరాత్ యాజమాన్యం, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలుత సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
కెప్టెన్సీ షరతుతో బ్రేక్
అయితే ఈ చర్చలలో అనూహ్య పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్‌లోకి తిరిగి రావాలంటే తనకు మళ్లీ కెప్టెన్సీ ఇవ్వాలని హార్దిక్ షరతు పెట్టినట్లు క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రతిపాదనకు శుభ్‌మన్ గిల్‌తో పాటు గుజరాత్ యాజమాన్యం అంగీకరించలేదని సమాచారం. కెప్టెన్సీ విషయంలో హార్దిక్ పెట్టిన షరతును వారు తిరస్కరించడంతో ఇరు వర్గాల మధ్య జరిగిన చర్చలు ముందుకు సాగలేదని తెలుస్తోంది. దీంతో గుజరాత్ టైటాన్స్‌లో హార్దిక్ రీఎంట్రీకి బ్రేక్ పడినట్లు సమాచారం.
కేకేఆర్, సీఎస్కేతో చర్చలు?
గుజరాత్‌తో డీల్ కుదరకపోవడంతో హార్దిక్ ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అజింక్య రహానే రిటైర్మెంట్ ప్రకటించడంతో కేకేఆర్‌కు కొత్త కెప్టెన్ అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాకు కేకేఆర్ నాయకత్వం అప్పగించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలలో చర్చ జరుగుతోంది.

