కలం, హనుమకొండ : ఆషాఢ మాస ముగింపు అమావాస్య సందర్భంగా హనుమకొండ (Hamumakonda) మారుతీల్స్ కాలనీ, న్యూ శాయంపేట సర్కిల్ చాకిరేవు గుట్టపై ఉన్న శ్రీ వారాహి సహిత ఉన్మత్త భైరవ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. అమావాస్యను పురస్కరించుకుని ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అమ్మవారికి విశేష అలంకరణ కార్యక్రమాలను నిర్వహించారు.
భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని తమ కుటుంబాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వీరభద్రనాథ్ మాట్లాడారు.
ఆషాఢ మాస ముగింపు అమావాస్యకు ఎంతో విశిష్టత ఉందన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని, ప్రతి కుటుంబంపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులు అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు.

