కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్ సిబ్బందికి (Contract Workers) నెల మొదటి రోజే ఎన్ని ఇబ్బందులు ఉన్న వేతనాలు చెల్లించాలని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. అయినప్పటికీ ఆయన సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లాలోనే సగం నెల గడుస్తున్న నేటికీ కార్మికులకు పెండింగ్ వేతనం చేతికి రాలేదని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (AITUC) రాష్ట్ర కార్యదర్శి పి. సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
నెల మొదటి రోజే వేతనం చెల్లించకుండా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడాన్ని నిరసిస్తూ బుధవారం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకుల నేతృత్వంలో మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రంగా అజ్మీరకి టోకేన్ సమ్మె నోటీసును కాంట్రాక్ట్ వర్కర్స్ (Contract Workers) అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కార్మికుల జీతాల చెల్లింపులో అధికారుల ఉదాసీనత వైఖరి, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పారదర్శకత కొరబడ్డాయని ఆరోపించారు.
జీతం కోసం ఆందోళనలు చేయాల్సిన దుస్థితి నెలకొనడం బాధాకరమని అన్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని సర్క్యులర్లు వచ్చిన కాంట్రాక్ట్ కార్మికుల దుస్థితి మాత్రం మారడం లేదని మండిపడ్డారు. తక్షణమే పెండింగ్ వేతనం చెల్లించాలని లేకపోతే టోకెన్ సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి బ్రాంచ్ నేతలు, కార్మికులు వై. రంగన్న, బి. చెన్నయ్య, యస్. మన్యం, అంజలయ్య, శ్రీనివాస్ రెడ్డి, ఎల్లమ్మ, నాగమ్మ, చంద్రకళ, సునీత, పద్మ, ఇందిరా, లక్ష్మమ్మ, జంగమ్మ, విజయనిర్మల, పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
Also Read : భూభారతితో భూ దందాలు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Follow Us On: Instagram

