కలం, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించడంలో గత, ప్రస్తుత పాలకులు పూర్తిగా విఫలమయ్యారని సిపిఎం (CPM) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో కీలక ప్రాజెక్టులైన బస్వాపురం, గంధమల్ల, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, నవాబ్‌పేట రిజర్వాయర్ ప్రాజెక్టుల పనులను పూర్తి చేయడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. అలాగే ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, బునాదిగాని, ఆసిఫ్ నహర్ కాలువల పునరుద్ధరణ పనులను కూడా వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 29, 30, 31 తేదీలలో ‘సిపిఎం చలో హైదరాబాద్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జహంగీర్ తెలిపారు. ఇందులో రైతులు, నిర్వాసితులు, ప్రజలతో కలిసి పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. బస్వాపురం ప్రాజెక్టు పనులు సుమారు 90 శాతం పూర్తయినా మిగిలిన పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు సుమారు రూ.420 కోట్లకు పైగా పరిహారం చెల్లించాల్సి ఉందని తెలిపారు. రూ.80 కోట్లు మంజూరు చేసినట్లు చెబుతున్నప్పటికీ ఏడాది కాలంగా ఫైనాన్స్ కమిటీ వద్దే నిధులు నిలిచిపోయాయని ఆరోపించారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

