కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లాలో సెన్సస్ హ్యాండ్‌బుక్ (Census Handbook) రూపకల్పనకు శాఖల వారీగా సంబంధిత సమాచారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ (Nirmal Collector) భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సెన్సస్ హ్యాండ్‌బుక్ రూపకల్పనపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని జనాభా, అక్షరాస్యత, భౌగోళిక పరిస్థితులు, విద్య, వైద్యం, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం తదితర అంశాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని అత్యంత ఖచ్చితత్వంతో సేకరించాలని సూచించారు.
భవిష్యత్తులో జిల్లా సమగ్ర అభివృద్ధికి, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుకు సెన్సస్ హ్యాండ్‌బుక్ ప్రామాణిక సమాచారంగా ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లాలోని భౌగోళిక, సాంస్కృతిక అంశాల అభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రణాళిక, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్య, వైద్యారోగ్య తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోగా నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. వివరాల సేకరణలో ఎలాంటి తప్పులకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సేకరించిన సమాచారాన్ని క్షేత్రస్థాయిలో పునఃపరిశీలించిన అనంతరం మాత్రమే తుది నివేదికలో పొందుపరచాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, సీపీవో గంగారెడ్డి, ఆర్డీవో దేవీదాస్ తదితరులు పాల్గొన్నారు.

