విద్యా ప్రమాణాలు పెంచేలా ‘శత శాతం’: యెన్నం శ్రీనివాస్ రెడ్డి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ‘శతశాతం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) తెలిపారు. మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో వందేమాతరం ఫౌండేషన్ సహకారంతో మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ తరగతుల కార్యక్రమం సోమవారంతో ముగిసింది. విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సొంత నిధులతో పాటు విద్యాశాఖ సహకారంతో ఎంపిక చేసిన వంద మంది విద్యా వాలంటీర్లకు మూడు రోజుల పాటు శిక్షణ అందించినట్లు తెలిపారు.

ఖండాంతర స్థాయిలో గుర్తింపు..

యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మంచి సంకల్పంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం జిల్లా, రాష్ట్ర స్థాయిని దాటి ఖండాంతర స్థాయిలో గుర్తింపు పొందిందన్నారు. తనకు అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) కమ్యూనిటీ సర్వీస్ అవార్డు అందించడం ఆనందంగా ఉందన్నారు. సబ్జెక్ట్ నిపుణులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను రిసోర్స్ పర్సన్లుగా తీసుకురావడంతో పాటు సైకాలజిస్టుల సహకారంతో పిల్లల మనోభావాలను అర్థం చేసుకునేలా శిక్షణ అందించినట్లు వెల్లడించారు. శిక్షణ పొందిన వాలంటీర్లు తమకు కేటాయించిన పాఠశాలల్లో “శతశాతం” కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.

ఈ ఏడాది వంద పాఠశాలల్లో..

గత ఏడాది 30 ప్రభుత్వ పాఠశాలల్లో శత శాతం కార్యక్రమాన్ని అమలు చేసి అద్భుత ఫలితాలు సాధించినట్లు విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. పాస్ అవుతారా.. లేదా అనుకున్న విద్యార్థులు 500కు పైగా మార్కులు పొందడం, 16 మండలాల్లో 16 మంది టాపర్లను అందించడం ఈ కార్యక్రమ విజయమన్నారు. ఈ ఏడాది 100 పాఠశాలల్లో ఈ కార్యక్రమం విస్తరించినట్లు తెలిపారు. దాదాపు 16 వేల మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్న నేపథ్యంలో విద్యా వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా అందరూ ఒక టీమ్‌గా కలిసి పనిచేస్తున్నామని తెలిపారు.

తల్లిదండ్రుల బాధ్యతను తీసుకుని..

వందేమాతరం ఫౌండేషన్ ఫౌండర్ రవీందర్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల బాధ్యతను తాను తీసుకుని విద్యార్థుల భవిష్యత్తు కోసం యెన్నం శ్రీనివాస్ రెడ్డి తపిస్తున్నారని, ఆయనో విద్యా యజ్ఞ రూపశిల్పి అని ప్రశంసించారు. నియోజకవర్గంలో విద్యా వ్యవస్థ బాగు చేయడానికి భుజస్కంధాలపై వేసుకొన్నారని చెప్పారు. శిక్షణ తరగతులను నిర్వహించిన రీసోర్స్ పర్సన్లను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ఎఎంవో దుంకుడు శ్రీనివాస్, మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, వందేమాతరం ఫౌండేషన్ సమన్వయ కర్త రవీందర్ రెడ్డి, పీఆర్టీయూ అధ్యక్షులు మదన్మోహన్ యాదవ్, నాయకులు సుధాకర్ రెడ్డి, బుచ్చారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>