కలం, కరీంనగర్: కరీంనగర్‌లోని (Karimnagar) వాసర గార్డెన్స్‌లో కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఆదివారం జనసేన(Janasena) పార్టీ ‘ఆత్మీయ (ప్రిపరేటరీ) సమావేశం’ ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనసైనికులు, వీరమహిళలు హాజరయ్యారు.
కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో అహర్నిశలు పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను భవిష్యత్ నాయకుడిగా తీర్చిదిద్దడమే జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు సమాజంలోని అన్ని వర్గాలతో పాటు ముఖ్యంగా యువతను ఆకట్టుకుంటున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల నుంచి మారుమూల గ్రామాల వరకు జనసేనను మరింత విస్తరించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. అలాగే ప్రాంతీయ స్థాయితో పాటు జాతీయ స్థాయిలోనూ పవన్ కళ్యాణ్ ప్రజాదరణ, ప్రభావం రోజురోజుకూ పెరుగుతోందని నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
పాల్గొన్న నాయకులు
ఈ ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు నేమురి శంకర్ గౌడ్, రామ్ తల్లూరి, ఆర్.కే. సాగర్, మచ్చ సుధాకర్, కరీంనగర్ పార్లమెంటరీ కో-ఆర్డినేటర్ డాక్టర్ బండారి రాజ్ కుమార్, డాక్టర్ కృష్ణ ప్రియలతో పాటు సీనియర్ నాయకులు కందుల రాజిరెడ్డి, కాస రాజు పటేల్, అజయ్ బబ్లు, పెంటల మహేష్, మొగిలిపాలెం రమేష్, సంజీవ్, చల్లా శివారెడ్డి, చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి, తగరపు శ్రీనివాస్, వీర్ల శ్రీనివాసరావు, పొన్నాల తిరుపతి, పాతురి వేణుగోపాల్ రెడ్డి, జంగ మహేష్, కందికట్ల స్వరూప, గుండ శకుంతల, మహదేవ్ రాజ్ కుమార్, రేగుల హరీష్ తదితరులు పాల్గొన్నారు.

