కలం, వెబ్‌డెస్క్: ఇటీవల రాజమండ్రిలోని ప్రసాదిత్య మాల్ వద్ద ఇద్దరు యువకులు ప్రియాంక అనే మెడికల్ స్టూడెంట్ (Medical Student Priyanka) పై కారు ఎక్కించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విద్యార్థిని తీవ్ర గాయాలపాలైంది. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. డాక్టర్లు బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం స్పందిచకపోవడంతో ప్రియాంక తండ్రి వెంకటేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేశ్‌లకు ఆడపిల్లలు, చెల్లెళ్లు, అక్కలు లేరా అని ప్రశ్నించారు. వారం వారం హైదరాబాద్ వస్తారు కదా.. ఒక్కసారి వచ్చి నా బిడ్డ పరిస్థితి తెలుసుకోరా? అని అడిగారు.
తన కుమార్తె చావు బతుకుల మధ్య ఉందని రాష్ట్రమంతా తెలిసినా చంద్రబాబు, పవన్ , లోకేశ్ మాత్రం కనీసం స్పందించలేదన్నారు. ఇలా ఒక మనిషిని వాహనాలతో గుద్ది ఇష్టారాజ్యంగా మళ్లీ తిరగొచ్చా? అని ప్రశ్నించారు. అసలు ఈ ప్రభుత్వంలో చట్టాలు పని చేస్తున్నాయా? అని నిలదీశారు. మహిళా హోం మినిస్టర్ ఉండి కూడా ఏం ప్రయోజనం అన్నారు. ఆడపిల్లలకు రాష్ట్రంలో రక్షణ ఎక్కడ ఉందని అడిగారు. తమ కుటుంబానికి ఇది ఎంతో తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబంలో ప్రియాంక మొట్టమొదటి డాక్టర్ అని, ఎన్నో ఆశలతో చదివించుకుంటే తమ కలల సౌధం కూలిపోయిందని బాధ పడ్డారు. ఈ ప్రభుత్వం ఆడబిడ్డల ప్రాణాలు ఏం భరోసా ఇస్తుందని నిలదీశారు.

