కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta) పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (MLA Beerla Ilaiah) స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహించిన ‘మార్నింగ్ వాక్’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే స్థానిక ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు అధికారులతో కలిసి వివిధ అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా పాతగుట్ట రోడ్డు, బీసీ కాలనీ, నల్లచెరువు, అంగడి బజార్, బాలికల వసతి గృహం తదితర ప్రాంతాలను ఎమ్మెల్యే సందర్శించారు. నల్లచెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు పాతగుట్ట రోడ్డులోని హనుమాన్ ఆలయం వద్ద నిర్మిస్తున్న సీసీ రోడ్డు, వాటర్ ట్యాంక్ పనులను తనిఖీ చేశారు.
పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. పట్టణంలో డ్రైనేజీ, రహదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీసీ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే.. లబ్ధిదారులతో మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనం అందేలా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం బీసీ కాలనీలోని బాలికల వసతి గృహాన్ని సందర్శించిన బీర్ల అయిలయ్య విద్యార్థులకు కుర్చీలు, ప్లేట్లు, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. గతంలో మంత్రి కొండా సురేఖ పర్యటన సందర్భంగా విద్యార్థులు చేసిన విజ్ఞప్తి మేరకు యాదగిరిగుట్ట డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు సహకారంతో ఈ సామగ్రిని అందించినట్లు తెలిపారు. విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడిన ఎమ్మెల్యే వారికి స్వయంగా అల్పాహారం వడ్డించారు.
ప్రజలకు మరింత సౌకర్యంగా ఉండేలా యాదగిరిపల్లి, అంగడి బజార్ ప్రాంతాలలో నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి అవసరమైన స్థలాలను పరిశీలించారు. పాతగుట్టలోని కల్లు కాంపౌండ్‌ను సందర్శించిన ఎమ్మెల్యే గౌడ సామాజికవర్గ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, గౌడ వృత్తిదారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పట్టణ అభివృద్ధి పనులు ఆలస్యం కాకుండా అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బీర్ల అయిలయ్య తెలిపారు.

