కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ‘హిల్ట్’ పాలసీకి (HILT Policy) పరిశ్రమల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కరువైంది. హైదరాబాద్ నగరంలో సుమారు రెండు వేల పరిశ్రమలు ఉంటే అందులో ఇప్పటివరకు షిప్ట్ చేస్తామని గత నెల 26 నాటికి దరఖాస్తు చేసినవి 193 ఇండస్ట్రీలు మాత్రమే. ఇందులో 54 అప్లికేషన్లు (28%) డాక్యుమెంటేషన్ లోపాలతో రివర్స్ వెళ్ళాయి. మిగిలిన దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వ స్థాయి, స్క్రూటినీ కమిటీ, జోనల్ లెవల్లో పరిశీలనలో ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ కోసం ప్రభుత్వం ప్లాన్ చేస్తన్నప్పుడే నగరంలోని పరిశ్రమలను (కాలుష్యం సృష్టించే) ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల ‘ప్యూర్’ (పెరీ అర్బన్ రీజియన్ – ఓఆర్ఆర్, రీజినల్ రింగ్ రోడ్డు మధ్యలో) పరిధిలోకి షిప్ట్ చేసేలా ‘హిల్ట్’ పాలసీ తీసుకొచ్చింది. ఈ పాలసీ రూపకల్పనకు ముందే పరిశ్రమల యాజమాన్యం, సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు నిర్వహించింది. వారి నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు పాలసీ ఫైనల్ అయింది. కానీ అమలు చేస్తున్న క్రమంలో ఇండస్ట్రియలిస్టుల నుంచి స్పందన నామమాత్రంగా ఉండడంతో ముఖ్యమంత్రి ఆలోచన వేగానికి తగిన స్థాయిలో ఆచరణ లేకపోవడం గమనార్హం.
ఇక్కడ పరిశ్రమల స్థలాలు ఇతర అవసరాలకు
హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్ తరాలకు కాలుష్యం లేని తీరులో తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం హిల్ట్ పాలసీ తీసుకొచ్చింది. ఇక్కడి పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపల ఉన్న ‘ప్యూర్’కు తరలించి, ఆ భూములను ఆధునిక నివాస, వాణిజ్య, ఐటీ, మిక్స్డ్-యూజ్ అభివృద్ధికి వినియోగించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. నగరంలో 21 ఇండస్ట్రియల్ ఎస్టేట్లు, దాదాపు 9,200 ఎకరాల భూమి, సుమారు 2 వేల పరిశ్రమలు ఉన్నా ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు 193 మాత్రమే. అర్హత ఉన్న పరిశ్రమల్లో సుమారు 10% కూడా ‘హిల్ట్’కు అనుకూలంగా స్పందించలేదు. పాలసీ అమలులో ఈ సవాళ్లను ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందనేది కీలకంగా మారింది. ఇప్పటివరకు వచ్చిన 193 దరఖాస్తుల్లో ఆమోద కమిటీ దగ్గర 47 అప్రూవల్ కోసం పెండింగ్‌లో ఉన్నాయి. టీజీఐఐసీ ప్రధాన కార్యాలయ స్క్రూటినీ కమిటీ దగ్గర 20, జోనల్ స్థాయిలో 72 చొప్పున దరఖాస్తులు ఆమోదం కోసం పరిశీలనలో ఉన్నాయి. వివిధ డాక్యుమెంటేషన్ లోపాల కారణంగా 54 దరఖాస్తులను అధికారులు తిప్పి పంపారు. పాలసీ రూకపల్పనకు ముందు ఆసక్తి చూపిన పరిశ్రమలే ఇప్పుడు ఆ ప్రక్రియ అమలుపై సానుకూలంగా లేవన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
పరిశ్రమల యాజమాన్యాలకు బలమైన కారణాలు
‘హిల్ట్’ పాలసీకి స్పందన తక్కువగా ఉండటానికి పరిశ్రమల యాజమాన్యాలు చెబుతున్న కారణాలు కీలకంగా మారాయి. ప్రభుత్వ ఉద్దేశంలో ఇది కేవలం పరిశ్రమల మార్పిడిగా కనిపిస్తున్నా పారిశ్రామిక వర్గాల్లో మాత్రం దశాబ్దాలుగా నిర్మించుకున్న ఉత్పత్తి వ్యవస్థను పూర్తిగా మరోచోటకు తరలించడంలో ఉన్న చిక్కులుగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు నగరంలో ఉన్న ఈ పరిశ్రమలకు చెందిన భూములను విక్రయించాలన్నా ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఆశించిన ధరకు కొనుగోలుదారులు దొరకడం లేదన్నది యజమానుల వాదన. మరోవైపు ఓఆర్ఆర్ వెలుపల కొత్త భూములు కొనుగోలు చేయడం, రిజిస్ట్రేషన్, అనుమతులు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సమయం, వ్యయం పెరుగుతున్నాయన్నది మరో వాదన. వీటికి తోడు పరిశ్రమల్లోని ప్రత్యేక ఉత్పత్తి లైన్లు, బాయిలర్లు, ఫర్నేస్‌లు, ప్రాసెసింగ్ యూనిట్లు, సున్నితమైన ఎక్విప్మెంట్ను విడదీసి మరోచోట తిరిగి ఏర్పాటు చేయడం సాంకేతికంగా క్లిష్టమైన ప్రక్రియగా వారు భావిస్తున్నారు. ఇంకోవైపు ట్రాన్సిషన్ (తరలింపు సమయంలో) ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతుందని, కొత్త ప్రదేశంలో మళ్లీ కాలిబ్రేషన్, ట్రయల్ రన్స్, కొత్త అనుమతులు తీసుకోవాల్సి రావడం కీలకమని ప్రభుత్వానికి వివరించారు.
ఆరు నెలల గడువు కావాలన్న పరిశ్రమలు
‘హిల్ట్’ అమలుపై ప్రభుత్వం నిర్వహించిన సమావేశాల్లో పారిశ్రామిక సంఘాలు కూడా పలు కీలక సూచనలు చేశాయి. ఆరు నెలల అదనపు ట్రాన్సిషన్ గడువు ఇవ్వాలని, పరిశ్రమలను ఒకే ఏడాదిలో తరలించడం సాధ్యం కాదని, దాన్ని మూడు నుంచి ఐదేళ్లకు పెంచాలని, కొత్త ప్రాంతాల్లో ముందుగానే రోడ్లు, విద్యుత్, నీరు, డ్రైనేజీ, కార్మికుల నివాస సదుపాయాలు కల్పించాలని ప్రతిపాదించాయి. విద్యుత్, నీటి కనెక్షన్ల మార్పుపై అదనపు ఛార్జీలు విధించవద్దని, మార్పిడి ఛార్జీలను తగ్గించాలని, ప్రాధాన్యత ఆధారంగా కొత్త భూములు కేటాయించాలని విజ్ఞప్తి చేశాయి. జీడిమెట్ల, చర్లపల్లి, ఉప్పల్ తదితర పారిశ్రామిక సంఘాలు ప్రభుత్వానికి ఈ సూచనలు సమర్పించాయి. ‘హిల్ట్’ పాలసీ ద్వారా ప్రభుత్వం డిఫరెన్షియల్ ఇంపాక్ట్ ఫీజు రూపంలో గణనీయమైన ఆదాయం సమకూరుతుందని భావించినా ఇప్పటివరకు దరఖాస్తుల ద్వారా వచ్చింది రూ.150 కోట్లు మాత్రమే. మొత్తం రూ.1,500 కోట్ల లక్ష్యంలో ఇది 10 శాతమే. పాలసీ అమలు మందగించినా, ఆలస్యమైనా ప్రభుత్వ ఆదాయ అంచనాలు మారుతాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకుంటుందన్నది ఆసక్తికరం.
నాడు ఇండస్ట్రీస్.. నేడు రెసిడెన్షియల్ కాలనీలు
నాలుగైదు దశాబ్దాల కిందట నగర శివార్లలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ప్రాంతాల చుట్టూ ఇప్పుడు నివాస ప్రాంతాలుగా మారాయి. వాయు కాలుష్యం, భూగర్భ జలాల కాలుష్యం, ట్రాఫిక్ ఒత్తిడి పెరుగుతుండడంతో వాటిని బయటకు తరలించి, హైదరాబాద్‌ను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్నది ‘హిల్ట్’ ఉద్దేశమని ప్రభుత్వం పాలసీలోనే స్పష్టం చేసింది. ఇది పూర్తిగా స్వచ్ఛంద విధానమేనని, ఎవరినీ బలవంతంగా తరలించడం లేదని కూడా వివరించింది. పాలసీని పారిశ్రామిక సంఘాలు వ్యతిరేకించకపోయినా అమలు చేయడంలో మాత్రం అనిశ్చితితో ఉన్నాయి. ఇందుకు కారణం పరిశ్రమల షిప్టింగ్‌తో పాటు కొన్ని ప్రాక్టికల్ సమస్యలు. ‘పొల్యూషన్-ఫ్రీ’ హైదరాబాద్ అనే ప్రభుత్వ లక్ష్యానికి పరిశ్రమలు సానుకూలంగానే ఉన్నా ప్రభుత్వం తగినంత గడువు ఇవ్వడం, కొత్త ప్రాంతంలో మౌలిక సౌకర్యాలు కల్పించడం, పర్మిషన్లు ఇవ్వడంలో అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం.. వీటిపైనే పరిశ్రమల యజమానులు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఈ పాలసీ కాగితాలకే పరిమితం కాకుండా కార్యరూపం దాల్చాలంటే, సక్సెస్ కావాలంటే పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం క్లియర్ చేయడం కీలకమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జూలై 26 నాటికి ‘హిల్ట్’ అప్లికేషన్ల స్టేటస్
మొత్తం దరఖాస్తులు : 193
అప్రూవల్ కమిటీ దగ్గర పెండింగ్ : 47
స్క్రూటినీ కమిటీ దగ్గర (టీజీఐఐసీ) : 20
జోనల్ లెవల్లో ఉన్నవి : 72
లోపాలతో రిజెక్ట్ అయినవి : 54

