కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సింగ్ ఆఫీసర్ల డిప్యూటేషన్లలో జరుగుతున్న వ్యత్యాసం కారణంగా వైద్య సేవలపై ప్రభావం చూపుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కనిపిస్తున్న ఈ పరిస్థితి ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల, జగిత్యాల, రామగుండం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొనసాగుతోందని సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లు పేర్కొంటున్నారు.
2024లో రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి సుమారు 200 మంది నర్సింగ్ ఆఫీసర్లను నియమించింది. వీరికి రెండేళ్ల ప్రొబేషన్ కాలం ఉంటుంది. ఇదే సమయంలో ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న నర్సింగ్ పాఠశాల, కాలేజీలో పలువురు నర్సింగ్ ఆఫీసర్లు డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఆసుపత్రిలో పనిచేయకపోయినా..
ప్రస్తుతం నర్సింగ్ పాఠశాలలో 8 మంది, నర్సింగ్ కళాశాలలో ఏడుగురు డిప్యూటేషన్‌పై కొనసాగుతున్నారని సిబ్బంది చెబుతున్నారు. అక్కడ పనిచేసేవారికి ఆసుపత్రుల్లో పని చేసే వారిలా మూడు షిఫ్టులు, నైట్ డ్యూటీలు, ప్రత్యక్షంగా రోగులకు సేవలందించే నర్సింగ్ ఆఫీసర్లతో సమానంగా అదనపు హెచ్ఆర్ఏ, ధోబీ అలవెన్స్, రిస్క్ అలవెన్స్ వంటి ప్రయోజనాలు అందుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి విధుల్లో పాల్గొనని సిబ్బందికి ఈ తరహా అలవెన్సుల చెల్లింపులను ప్రభుత్వం సమీక్షించి, విధుల స్వభావానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు.
రోస్టర్ కేటాయింపులో సమానత్వం ఎక్కడ..
ఇక ఆసుపత్రిలో ప్రత్యక్షంగా రోగులకు సేవలందించే నర్సింగ్ ఆఫీసర్లు మూడు షిఫ్టులు, నైట్ డ్యూటీలు, అత్యవసర సేవలతో నిరంతరం అధిక పని భారం మోస్తున్నారని చెబుతున్నారు. డ్యూటీ రోస్టర్లోనూ సమానత్వం లేకపోవడంతో కొందరికి తరచూ నైట్ డ్యూటీలు, మరికొందరికి రెండేళ్లలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే నైట్ డ్యూటీలు వచ్చాయని ఆరోపిస్తున్నారు. రెండేళ్ల కిందట నర్సింగ్ పాఠశాలలో కేవలం ముగ్గురు లేదా నలుగురు నర్సింగ్ ఆఫీసర్లతోనే విధులు నిర్వహించేవారని, ప్రస్తుతం డిప్యూటేషన్‌పై ఉన్న వారి సంఖ్య దాదాపు పది మందికి చేరిందని సిబ్బంది పేర్కొంటున్నారు. నర్సింగ్ కళాశాలలో కూడా అవసరానికి మించి పలువురు డిప్యూటేషన్‌పై కొనసాగుతున్నారని అంటున్నారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (INC) మార్గదర్శకాల ప్రకారం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకులు, సిబ్బంది ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో నర్సింగ్ పాఠశాల, కళాశాలల్లో అవసరమైనంత మంది మాత్రమే డిప్యూటేషన్‌పై కొనసాగిస్తే సరిపోతుందని సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు. అవసరానికి మించి ఉన్న నర్సింగ్ ఆఫీసర్లను తిరిగి ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులకు పంపిస్తే రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
అదే విధంగా నర్సింగ్ పాఠశాలలు, కళాశాలల్లో డిప్యూటేషన్లను శాశ్వతంగా ఒకే వ్యక్తులకు కొనసాగించకుండా రొటేషన్ విధానంలో అమలు చేయాలని సూచిస్తున్నారు. కొంతకాలం ఒక బృందాన్ని, అనంతరం మరో బృందాన్ని డిప్యూటేషన్‌పై పంపే విధానాన్ని అమలు చేస్తే అందరికీ సమాన అవకాశాలు లభించడమే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత కూడా తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు.
ప్రతి నర్సింగ్ ఆఫీసర్ బాధ్యత అదే..
నర్సింగ్ ఆఫీసర్లకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిన ప్రధాన ఉద్దేశ్యం నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తప్ప, ఆసుపత్రి సేవలకు దూరంగా ఉండి డిప్యూటేషన్ల ద్వారా అలవెన్సుల ప్రయోజనాలు పొందడం కాదని పలువురు సీనియర్లు పేర్కొంటున్నారు. ఉద్యోగంలో చేరిన వెంటనే ప్రజలకు సేవలందించి వారి మన్ననలు పొందాల్సిన బాధ్యత ప్రతి నర్సింగ్ ఆఫీసర్‌పై ఉందంటున్నారు. డిప్యూటేషన్ వ్యవస్థలో పారదర్శకత లేకపోవడం వలన ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందిపై అదనపు పని భారం పడుతోందని ఆరోపిస్తున్నారు.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి నర్సింగ్ ఆఫీసర్‌కు సమానంగా డ్యూటీలు కేటాయిస్తూ పారదర్శక రోస్టర్ విధానాన్ని అమలు చేయాలని సిబ్బంది కోరుతున్నారు. కరీంనగర్‌తో పాటు సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రులు, రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ వైద్యశాలల్లో కూడా డిప్యూటేషన్ విధానం, అలవెన్సుల చెల్లింపు, డ్యూటీ రోస్టర్లపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సమగ్ర సమీక్ష నిర్వహించి, అవసరమైన సంస్కరణలు చేపట్టాలని సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లు డిమాండ్ చేస్తున్నారు.

