కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలోని పేద కుటుంబాలకు మెరుగైన ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని.. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఈశ్వరమాధారం గ్రామంలోని చౌక ధరల దుకాణంలో గురువారం జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్తో కలిసి మంత్రి పొంగులేటి లబ్ధిదారులకు మూడు నెలల ఉచిత సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదలకు భరోసా కల్పించేలా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. రేషన్ వ్యవస్థ ద్వారా ప్రతి వ్యక్తికి ప్రతి నెల 6 కిలోల చొప్పున ఉచితంగా నాణ్యమైన సన్నబియ్యాన్ని అందిస్తున్నామని తెలిపారు.
దేశంలో రేషన్ వ్యవస్థ ద్వారా నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు. గతంలో పంపిణీ చేసిన దొడ్డు బియ్యం చాలామంది వినియోగించుకోలేక విక్రయించడం, అక్రమ రీసైక్లింగ్‌కు గురికావడం వల్ల ప్రభుత్వ ధనం వృథా అయ్యేదని అన్నారు. ప్రస్తుతం నాణ్యమైన సన్నబియ్యం అందించడంతో ప్రజలు స్వయంగా వినియోగించుకుంటున్నారని తెలిపారు. బియ్యం నాణ్యతపై ప్రజలలో అవగాహన పెరిగిందని, ఒక్క గింజ తక్కువ వచ్చినా రేషన్ డీలర్లను ప్రశ్నించే స్థాయికి ప్రజలు చేరుకోవడం అభినందనీయమన్నారు.
సన్నబియ్యంపై లబ్ధిదారుల హర్షం
ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం నాణ్యత ఎంతో మెరుగ్గా ఉందని లబ్ధిదారులు తెలిపారు. గతంలో రేషన్ బియ్యాన్ని విక్రయించేవారమని, ప్రస్తుతం ఇంట్లోనే వండుకుని తినడం వల్ల కుటుంబాలకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ప్రయోజనం కలుగుతోందని వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రేషన్ షాప్ డీలర్ వై. సైది రెడ్డి, గ్రామస్థులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

