కలం, దేవరకొండ: ప్రభుత్వ విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే (Devarakonda MLA) నేనావత్ బాలు నాయక్ (Balu Naik) పేర్కొన్నారు. నేరేడుగొమ్ము (Neredugommu) మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో రూ.88.35 లక్షల గిరిజన సంక్షేమ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్మించనున్న కాంపౌండ్ వాల్, ప్రత్యేక మరమ్మతులు, టాయిలెట్ బ్లాక్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే అధికారులతో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థినులు మెరుగైన విద్యను అభ్యసించడంతో పాటు సురక్షితమైన వాతావరణంలో చదువుకునేలా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. పాఠశాల సమగ్ర అభివృద్ధికి రానున్న రోజులలో మరిన్ని నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల ఆరోగ్యం, విద్యను దృష్టిలో ఉంచుకుని మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలను గణనీయంగా పెంచిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య, ఆధునిక సాంకేతిక వసతులు కల్పించేందుకు ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ ఏర్పాటు దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు.
దేవరకొండ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలు మార్చేందుకు అవసరమైన నిధుల కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ముక్కమల్ల వెంకటయ్య గౌడ్, సర్పంచ్ పులికంటి సుధాకర్, మాజీ జడ్పీటీసీ కేతావత్ బాలు నాయక్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ బైరెడ్డి కొండల్ రెడ్డి, నాయకులు యుగేందర్ రెడ్డి, గిరి యాదయ్య, గడ్డం వెంకటయ్య, సోమాని నాయక్, కొప్పుల సురేందర్ రెడ్డి, హేమ్లా నాయక్, ఉప సర్పంచ్ ఎలిజర్ల శ్రీను, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

