కలం, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న చెంచు గిరిజనుల జీవన పరిస్థితులు, విద్య, వైద్య సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ (Justice Shameem Akther) బుధవారం క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన నిర్వహించారు. జిల్లా పర్యటనలో భాగంగా నల్లమల ప్రాంతాన్ని సందర్శించిన ఆయన చెంచు గిరిజనుల వాస్తవ జీవన పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జస్టిస్ షమీమ్ అక్తర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి చెంచు కుటుంబానికి చేరేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గిరిజన పిల్లలు విద్యకు దూరం కాకుండా ప్రతి విద్యార్థి పాఠశాలకు హాజరయ్యేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం వట్టువర్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. వైద్యుల హాజరు, సిబ్బంది అందుబాటు, మందుల నిల్వలు, అత్యవసర వైద్య సేవలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలు, వ్యాధి నిరోధక చర్యలు, అంబులెన్స్ సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచు గిరిజనులకు వైద్య సేవలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుతున్నాయా, సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలు, దూర ప్రాంతాలలో మొబైల్ వైద్య సేవల అమలుపై ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రతి చెంచు కుటుంబానికి నాణ్యమైన ఆరోగ్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తదుపరి మల్లయ్యపెంట గ్రామాన్ని సందర్శించిన కమిషన్ చైర్మన్ చెంచు విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, భోజనం, వసతి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు.
గ్రామంలో చెంచు మహిళలు, వృద్ధులు, యువకులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, ప్రతి అంశాన్ని ఓపికగా విని సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నల్లమలలో నివసిస్తున్న చెంచు గిరిజనులు అభివృద్ధి ఫలాలను పూర్తిస్థాయిలో అందుకోవాలంటే ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం అత్యంత అవసరమని జస్టిస్ షమీమ్ అక్తర్ పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ, అచ్చంపేట ఆర్డీఓ యాదగిరి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్, అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు, విద్య, వైద్య, ఆరోగ్య, అటవీ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

