కలం, ఖమ్మం బ్యూరో : సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని, ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని సీపీఐ (CPI) జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా డిమాండ్ చేశారు. కొత్తగూడెం తాటిపల్లి రిసిడెన్సీలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లాలోని 7.80 లక్షల ఎకరాల ఆయకట్టుకు గాను ప్రస్తుతం కేవలం 2.40 లక్షల ఎకరాలకే నీరు అందుతోందని, 100 కిలోమీటర్లకు పైగా కాలువలు తవ్వి ప్రజలను నిర్వాసితులను చేసినప్పటికీ పూర్తిస్థాయిలో నీరందించకపోవడం దుర్మార్గమన్నారు.
సీతారామ పరిధిని పెంచి ఇల్లందు, పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాల్లోని చెరువులను నింపాలన్నారు. నిత్యావసరాలు, పెట్రో ఉత్పత్తుల ధరలను అదుపు చేయాలని, పంటలకు ఎంఎస్పీ చట్టబద్ధత కల్పించడంతో పాటు కేంద్రం మార్చిన 44 కార్మిక చట్టాలను రద్దు చేయాలని కోరారు. విద్య, ఉపాధి హక్కులను రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా చేర్చాలని, జిల్లాలోని మిగిలిన 73 వేల ఎకరాల పోడు భూములకు వెంటనే పట్టాలివ్వాలని, కేటీపీఎస్ వద్ద కొత్త ప్లాంట్ ఏర్పాటు చేసి భద్రాచలం సమీపంలోని 5 పంచాయతీలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు.
ఈ సమస్యలపై ఆగస్టు 6 నుండి 14 వరకు జిల్లాలోని ఏడూళ్ల బయ్యారం నుంచి అశ్వారావుపేట వరకు “ప్రజా చైతన్య యాత్రలు” చేపడుతున్నామని, ‘బద్లావ్ జరూరీ హై’ నినాదంతో సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర, జిల్లా నాయకులు ముత్యాల విశ్వనాథం, నరాటి ప్రసాద్, సలిగంటి శ్రీనివాస్, మేయర్ మూడ్ గణేష్, చంద్రగిరి శ్రీనివాసరావు, వి. పూర్ణచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

