కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన చేవెళ్ల డిక్లరేషన్‌లో దళితులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి (DHPS) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద డీహెచ్‌పీఎస్ సభ్యులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో దళితుల అభ్యున్నతి, సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారత పేరుతో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి చాలా కాలం గడిచినా వాటి అమలులో చిత్తశుద్ధి కనిపించడం లేదని విమర్శించారు.
చేవెళ్ల డిక్లరేషన్‌లో పేర్కొన్న అంబేద్కర్ అభయహస్తం, దళిత కుటుంబాల ఆర్థికాభివృద్ధి, విద్య, ఉపాధి అవకాశాలు, భూ పంపిణీ, గృహ హక్కులు వంటి హామీలను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రతి పేద, ఇల్లు లేని కుటుంబానికి కుల, మత, రాజకీయ భేదాలు లేకుండా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఇతర పేద కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
దళితుల అభివృద్ధికి కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించి, సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించకపోతే రాష్ట్రవ్యాప్తంగా డీహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు ఉషశ్రీ, రాష్ట్ర నాయకులు జెరిపోతుల కుమారస్వామి, జిల్లా కార్యదర్శి కొమురెల్లి బాబు, వంశీ, శ్రీనాథ్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

