కలం, నిర్మల్: ఉమ్మడి జిల్లా పరిధిలోని కవ్వాల్ టైగర్ జోన్లో అమలవుతున్న ఆంక్షలను సడలించాలని, లేదంటే ఆదివాసీలతో కలిసి అటవీ శాఖ అధికారులపై సహాయ నిరాకరణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (MLA Vedma Bhojju) హెచ్చరించారు. సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని హరిత రిసార్టులో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అటవీ శాఖలోని కొందరు అధికారులు అభివృద్ధికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మంచిర్యాల సీఎఫ్, ఎఫ్డీపీటీ శాంతారాం సహా కొందరు అధికారులు ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని విమర్శించారు.
ఇందనపల్లి ప్రాంతంలో ఆరుగురు ఆదివాసీ యువకులపై దాడి చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్చార్జి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణను 24 గంటల్లో సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివాసీలతో కలిసి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తాను ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, అటవీ శాఖలోని కొందరు అధికారుల తీరుకు మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తిగా ప్రజల పక్షాన నిలబడతానన్నారు. 24 గంటల తర్వాత ఉద్యమాన్ని మరింత విస్తరించి తిరుగుబాటు ఉద్యమానికి శ్రీకారం చుడతామని తెలిపారు.

