కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ డిసెంబర్ నాటికి సిద్ధం చేయాలని వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళిల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao) అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి యంగ్ ఇండియా స్కూల్ అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టర్ దివాకర్ టిఎస్, సీపీ సునీల్ దత్తో కలిసి మంత్రి తుమ్మల పనులను పరిశీలించి, పురోగతిపై సమీక్షించారు.
ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం..
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. వైద్య కళాశాల నిర్మాణంలో భాగంగా విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థినుల హాస్టల్ నిర్మాణాన్నిసెప్టెంబర్ ఒకటో తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌ను అక్టోబర్, డిసెంబర్ నాటికి మిగిలిన అన్ని పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఖమ్మంలో సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా ఈ ప్రాజెక్టులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాలేజీలో విద్యుత్, ఇతర మౌలిక వసతుల పనుల కోసం అదనంగా రూ.64 కోట్ల నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఫోన్లో కోరారు.
వచ్చే ఏడాది నుంచే ప్రవేశాలు..
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను మంత్రి తుమ్మల పరిశీలించారు. 17 బ్లాకులు, పేరెంట్స్ లాంజ్, డైనింగ్ హాల్ వంటి సదుపాయాలను నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పనులు పూర్తి చేసి సంబంధిత శాఖకు అప్పగిస్తే, వచ్చే ఏడాది నుంచే విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. మంత్రి వెంట సుడా ఛైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఖాదర్ బాబా, మార్కెట్ కమిటీ ఛైర్మన్ హన్మంతరావు, ఆర్డీవో శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాస చారి పాల్గొన్నారు.

