ఇలా అయితే కష్టమే.. జిల్లాధికారులకు నిర్మల్ కలెక్టర్ వార్నింగ్

కలం, నిర్మల్: జిల్లా అధికారుల పనితీరుపై నిర్మల్ కలెక్టర్ భవేష్ మిశ్రా (Collector Bhavesh Mishra) మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యాల సాధనలో అధికారులు మరింత బాధ్యతతో వ్యవహరించాలని, నిర్లక్ష్యం ప్రదర్శించే వారికి చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధికారుల పనితీరుపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు విధులు నిర్వహించాల్సిన కొందరు అధికారులు పదేపదే నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.

జిల్లాలో అమలవుతున్న ఫేస్ రికగ్నిషన్ హాజరు వ్యవస్థలో అనుమతి లేకుండానే పలువురు ఉద్యోగులు గైర్హాజరవుతున్న విషయం తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ప్రతి శాఖకు సంబంధించిన హాజరు పనితీరు నివేదికలను రోజువారీగా పరిశీలిస్తున్నానని, ఇకపై ఇలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు.

కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించాలని సూచించారు. మండల స్థాయి అధికారులు కూడా వసతి గృహాలను తనిఖీ చేయకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. పనితీరులో మార్పు తీసుకురాకపోతే కఠిన చర్యలు తప్పవని, జిల్లాలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>