కలం, ఖమ్మం బ్యూరో: భవిష్యత్తు అవసరాలే లక్ష్యంగా ఖమ్మం నగరంలో విద్యుత్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao) వెల్లడించారు. నగర వేగవంతమైన విస్తరణను దృష్టిలో ఉంచుకుని, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సోమవారం రఘునాథపాలెం మండలంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణంలో రూ.3.62 కోట్ల అంచనాతో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌కి కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.
భారీగా విద్యుత్ డిమాండ్..
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఖమ్మం నగరంలో రాబోయే రోజుల్లో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. 132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ అత్యంత ఆవశ్యకమని.. అనువైన ప్రభుత్వ భూమిని తక్షణమే గుర్తించి స్థల ఎంపిక, అంచనా వ్యయం, సాంకేతిక ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా ప్రతిపాదించే విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణ పనులను భూమి కేటాయింపు పూర్తయిన వెంటనే ప్రారంభించి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
త్వరగానే అనుమతులు జారీ..
విద్యుత్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మన జిల్లాకు చెందిన వారే కావడం వల్ల అవసరమైన పరిపాలనా, ఆర్థిక అనుమతులు త్వరగానే జారీ అవుతాయని మంత్రి తుమ్మల చెప్పారు. జిల్లా కలెక్టర్ పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తూ, వివిధ శాఖల నుంచి రావాల్సిన అనుమతులను సకాలంలో జారీ అయ్యేలా చూడాలని మంత్రి తుమ్మల సూచించారు. ఈ కార్యక్రమంలో సుడా ఛైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఖాదర్ బాబా, విద్యుత్ ఎస్‌ఈ శ్రీనివాస చారి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ హన్మంతరావు, ఆర్డీవో శ్రీనివాస్, విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

